ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పర్యావరణ పరిస్థితులు, దేశంలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ యువతకు పలు ప్రశ్నలు సంధించారు.
గ్రేట్ నికోబార్ దీవిలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఒకే ఒక్క శ్రేయోభిలాషి అయిన వ్యాపారవేత్త లాభం కోసం అక్కడి అపారమైన ప్రకృతి సంపదను బలి ఇస్తోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా గ్రేట్ నికోబార్ దీవిలోని దాదాపు 1.5 కోట్లకు పైగా చెట్లను నరికివేయడానికి, అలాగే ఎంతో కాలంగా ఉన్న పగడపు దిబ్బలను (Coral Reefs) ధ్వంసం చేయడానికి ప్రభుత్వం పూనుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా, అక్కడి జీవవైవిధ్యానికి కూడా కోలుకోలేని దెబ్బ అని పేర్కొన్నారు.
ప్రకృతిని వ్యాపార లాభాల కోసం ధ్వంసం చేయడం దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే అన్నారు రాహుల్. ఈ విధ్వంసాన్ని మౌనంగా చూస్తూ ఊరుకోలేమని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.ఈ పర్యావరణ విధ్వంసాన్ని ఎదుర్కొని, ఆపగల నిజమైన శక్తి కేవలం దేశ యువతకే ఉందని ఆయన స్పష్టం చేశారు.
యువత మేల్కొని పర్యావరణ పరిరక్షణ కోసం గళం విప్పాలని, అప్పుడే రాబోయే తరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకృతి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కోరారు.
Also Read:కొత్త రూల్ తీసుకొచ్చిన UPSC!

