NEET తర్వాత CBSE..ఇప్పుడు CUET-UG!

5
- Advertisement -

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET-UG) 2026 పరీక్షల్లో శనివారం తీవ్ర సాంకేతిక లోపాలు తలెత్తాయి. పలు కేంద్రాల్లో పరీక్ష ప్రారంభం కావడంలో గంటల తరబడి ఆలస్యం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వివరణ ఇచ్చుకున్నప్పటికీ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మోదీ ప్రభుత్వం లక్ష్యంగా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించాయి.

ఈ పరీక్షల ఆలస్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం అతిషి తీవ్రంగా స్పందించారు. ముందు నీట్ తర్వాత సీబీఎస్‌ఈ ఇప్పుడు సీయూఈటీ అంటూ వరుస వైఫల్యాలను ఎండగట్టారు. లక్షలాది మంది విద్యార్థులు పరీక్ష కేంద్రాల బయట గంటల తరబడి వేచి చూసేలా చేసిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అసమర్థతను ఆమె తీవ్రంగా తప్పుపట్టారు.

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం ఇదే ధోరణిలో స్పందిస్తూ.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పరీక్షల వివాదాలను కూడా ప్రస్తావించారు.నీట్, సీబీఎస్‌ఈ, ఎస్ఎస్‌సీ, ఇప్పుడు సీయూఈటీ.. నాలుగు పరీక్షలు, కోటి మంది విద్యార్థులు.. ఒక్క పరీక్ష కూడా నిజాయితీగా జరగలేదు అని రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని.. భవిష్యత్తును కోల్పోతున్న నేటి తరమే మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని హెచ్చరించారు.

ఈ గందరగోళంపై NTA క్లారిటీ ఇచ్చింది. తమ సాంకేతిక భాగస్వామి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వద్ద తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే కొన్ని కేంద్రాల్లో పరీక్ష ఆలస్యమైందని స్పష్టం చేసింది. సమస్యను వెంటనే పరిష్కరించి పరీక్షను ప్రారంభించామని.. ఆలస్యమైన సమయాన్ని విద్యార్థులకు అదనంగా కేటాయించామని తెలిపింది. దీనివల్ల ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగదని హామీ ఇచ్చింది.

Also Read:వెనక్కి తగ్గిన ‘పెద్ది’ నిర్మాతలు!

ఉదయం షిఫ్ట్ రెండు గంటలకు పైగా ఆలస్యం కావడంతో మధ్యాహ్నం షిఫ్ట్ సమయాలను కూడా ఎన్‌టీఏ మార్చింది. మధ్యాహ్నం పరీక్ష రిపోర్టింగ్ సమయాన్ని 2:30 గంటలకు, పరీక్ష ప్రారంభ సమయాన్ని 4:00 గంటలకు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి ఎన్‌టీఏ విచారం వ్యక్తం చేసింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ (91-11-40759000), ఈమెయిల్ (cuet-ug@nta.ac.in) అందుబాటులో ఉంచింది.

కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం (NEP) 2020 ప్రకారం.. 2022లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోని అన్ని కేంద్ర, రాష్ట్ర, ప్రముఖ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఉమ్మడి పరీక్షను నిర్వహిస్తారు. విద్యార్థుల సంఖ్య, వివిధ సబ్జెక్టుల కాంబినేషన్ల కారణంగా ఈ పరీక్షలను మే 11 నుండి మే 31 వరకు పలు రోజుల్లో, వివిధ షిఫ్టుల్లో నిర్వహిస్తున్నారు.

- Advertisement -