కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు భక్తులతో పోటెత్తాయి. వేసవి సెలవులు, వార్షిక పరీక్షలు ముగియడంతో దేశం నలుమూలల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో తిరుమలలోని అన్ని క్యూ కాంప్లెక్స్‌లు, షెడ్లు మరియు ఆరుబయట క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.
తిరుమలలో భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో మే 24న జరిగిన దర్శనాలే నిరూపిస్తున్నాయి. ఆ ఒక్క రోజే ఏకంగా 98 వేలకు పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 నుండి 34 గంటల వరకు సమయం పడుతోంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. అభిషేకం, తోమాల మరియు అర్చన సేవలు జరిగే సమయాల్లో కూడా భక్తులకు లఘుదర్శనం (త్వరితగతిన దర్శనం) కల్పిస్తూ ఎక్కువ మందికి స్వామివారి కృపాకటాక్షాలు అందేలా ఏర్పాట్లు చేసింది.
Also Read:బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..ఈ తప్పులు అస్సలు చేయకండి!
శ్రీవారికి భక్తులు సమర్పించే అత్యంత ముఖ్యమైన మొక్కు అయిన తలనీలాల సమర్పణ కూడా రికార్డు స్థాయిలో జరుగుతోంది. గత 15 రోజుల్లోనే దాదాపు 12.50 లక్షల మంది భక్తులు కళ్యాణకట్టలలో స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది.
ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం మరియు రాత్రి సమయాల్లో సాంబారన్నం పంపిణీ చేస్తున్నారు.అంతేకాకుండా, తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు ఇతర ప్రాంతాలలో కలిపి ప్రతిరోజూ దాదాపు 4 లక్షల మంది భక్తులకు టీటీడీ ఉచిత అన్నప్రసాద భోజన వసతిని కల్పిస్తోంది.

