కేరళలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయ ఖజానా నుండి బంగారు ఆభరణాలు, వజ్రాలు పొదిగిన ‘వైరం నామం’ అదృశ్యమయినట్లు పోలీసు నివేదిక వెల్లడించింది. ఆలయంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని, విలువైన వస్తువులను సురక్షితమైన లాకర్లలోకి మార్చాలని డీజీపీ సిఫార్సు చేశారు.
శ్రీ పద్మనాభస్వామి ఆలయ ఖజానా నుండి బంగారు, వజ్రాభరణాలు కనిపించకుండా పోయాయనే అనుమానాలు కేరళవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఆలయంలోని వెలకట్టలేని సంపద రక్షణ మరియు భద్రతపై పోలీసు నివేదిక తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.
హోం శాఖ కార్యదర్శికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సమర్పించిన సమగ్ర నివేదిక ప్రకారం… ఆలయ నిల్వ జాబితా (ఇన్వెంటరీ) లో దాదాపు 78 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, వజ్రాలు పొదిగిన ‘వైరం నామం’ అనే అత్యంత విలువైన ఆభరణం కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న భద్రతా ఏర్పాట్లపై పోలీసు చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆలయ పత్రాల ప్రకారం… వజ్రాలు పొదిగిన వైరం నామాన్ని కొన్ని నెలల క్రితం మరమ్మతుల (రిపేర్) కోసం బయటకు తీసుకెళ్లారు. అయితే అది ఇప్పటివరకు తిరిగి రాలేదు. అదేవిధంగా ఆరు నెలల క్రితం నిర్వహణ పనుల కోసం పంపిన ఒక బంగారు దీపం కూడా ఇంకా రాలేదు. శతాబ్దాల నాటి ఆలయ సంపదను పర్యవేక్షించడంలో, నిర్వహించడంలో ఉన్న జవాబుదారీతనంపై ఈ ఘటన అనేక అనుమానాలను రేకెత్తించింది. ఈ విలువైన పురాతన వస్తువులు అదృశ్యం కావడం అటు భక్తులను, ఇటు అధికారులను తీవ్రంగా కలవరపెడుతోంది.
ఆలయ సంపద రక్షణను బలోపేతం చేయడానికి డీజీపీ తన నివేదికలో కొన్ని కీలక సిఫార్సులు చేశారు. బంగారం, వెండి వస్తువులన్నింటినీ అత్యంత సురక్షితమైన భూగర్భ గదుల్లోకి (Vaults) మార్చాలని, భక్తులు సమర్పించే కానుకలను ప్రత్యేక లాకర్లలో భద్రపరచాలని సూచించారు. అలాగే ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద కఠినమైన తనిఖీలు చేపట్టాలని సరైన స్క్రీనింగ్ లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించకూడదని పేర్కొన్నారు. భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన, పవిత్రమైన ఈ ఆలయంలో ప్రమాదాలను తగ్గించడానికి, నిఘాను పెంచడానికి ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు.
Also Read:విజయన్‌కు షాక్..ఈడీ రైడ్స్!

