ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత కాలంలో పాత నిబంధనల పేరుతో ప్రజలకు సేవల అందజేతలో జాప్యం చేయడం ఏమాత్రం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు సామాన్యులకు సులభంగా వేగంగా అందడమే లక్ష్యంగా పరిపాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం కాలం చెల్లిన నిబంధనల స్థానంలో అవసరమైన కొత్త ‘బిజినెస్ రూల్స్’ మార్పునకు తక్షణ కార్యాచరణ సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ప్రభుత్వ సేవల సరళీకరణపై దిశా నిర్దేశం చేశారు.
అధికారులు ఇకనైనా పాత రొటీన్ పద్ధతులకు పూర్తిగా స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి హితవు పలికారు. వినూత్నంగా ఆలోచించి టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ క్షేత్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించాల్సి ఉందన్నారు. పాలనలో మరింత జవాబుదారీతనం పెంచేందుకు క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కేవలం కార్యాలయ నివేదికలే కాకుండా ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఉద్యోగుల పనితీరును క్రమబద్ధీకరించనున్నారు. విధుల్లో వెనుకబడిన వారికి లేదా ఆధునిక సాంకేతికతపై అవగాహన లేని వారికి ప్రత్యేకంగా ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఇతర విభాగాల అధికారులను ఆదేశించారు. ప్రతి ఉద్యోగి ప్రజా సేవకుడిగా మారినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రజలు తమ చిన్న చిన్న అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి మారాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం పెరగాలని పారదర్శకమైన సేవలు నూటికి నూరు శాతం లబ్ధిదారులకు చేరాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారి తమ బాధ్యతను గుర్తించి ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
Also Read:మళ్లీ పెరిగిన CNG ధరలు!
ముఖ్యంగా విద్యార్థులు సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న కుల ధ్రువీకరణ పత్రాల (Caste Certificates) జారీ ప్రక్రియపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. కుల ధ్రువీకరణ పత్రాల పొందే విషయంలో క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్లు అందేలా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని పేర్కొన్నారు.

