9వ తరగతి విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవల ప్రకటించిన నూతన త్రిభాషా విధానాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై వచ్చే వారం విచారణ జరుపుతామని భారత ప్రధాన న్యాయమూర్తి CJI తెలిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఈ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం ముందు ప్రస్తావించారు. విద్యార్థులు హఠాత్తుగా ఈ కొత్త భాషలను నేర్చుకుని, ఆపై 10వ తరగతి బోర్డు పరీక్షలను ఎలా రాయగలరు? ఈ నిర్ణయం విద్యావ్యవస్థలో తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది అని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్..ఈ విషయాన్ని మేము వచ్చే వారం విచారణకు స్వీకరిస్తాము అని పేర్కొన్నారు.
జాతీయ విద్యా విధానం (NEP) 2020 మరియు నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ (NCF-SE) 2023 మార్గదర్శకాలకు అనుగుణంగా, రాబోయే జూలై 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు మూడు భాషల అధ్యయనాన్ని సీబీఎస్‌ఈ తప్పనిసరి చేసింది. అయితే, 10వ తరగతి బోర్డు పరీక్షల్లో మూడో భాషకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదని బోర్డు ఇదివరకే స్పష్టం చేసింది. ఈ మూడు భాషల్లో కనీసం రెండు భాషలు తప్పనిసరిగా భారతీయ స్థానిక భాషలై ఉండాలి.
సీబీఎస్‌ఈ నూతన సెకండరీ స్కూల్ కరికులమ్ ప్రకారం, భాషా సబ్జెక్టులను మూడు స్థాయిలుగా (R1, R2, R3) విభజించారు.
R1 (Language 1): ఇది విద్యార్థి యొక్క ప్రధాన భాష లేదా మాతృభాష అవుతుంది.
R2 (Language 2): ఇది మొదటి భాషకు భిన్నమైన మరొక భాష అవుతుంది.
R3 (Language 3): ఈ మూడవ భాషను ప్రస్తుత విద్యాసంవత్సరం (2026-27) నుండి 6వ తరగతి నుండి తప్పనిసరి చేయనున్నారు. 2030-31 నాటికి దీనిని 10వ తరగతి వరకు పూర్తిగా అమలు చేయాలనేది బోర్డు లక్ష్యం.
R1 మరియు R2 స్థాయిలలో ఎంచుకునే భాషలు ఒకటి కాకూడదు. ఈ భాషల జాబితాలో భారతదేశ అధికారిక భాషలైన హిందీ, ఇంగ్లీష్‌లతో పాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న అన్ని భాషలు, ఇతర ప్రాంతీయ మరియు విదేశీ భాషలతో కలిపి మొత్తం 42 భాషలను సీబీఎస్‌ఈ ఆఫర్ చేస్తోంది. అయితే, ఈ విధానాన్ని 9వ తరగతి నుంచే హఠాత్తుగా అమలు చేయడంపైనే ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాలు నడుస్తోంది.
Also Read:త్వరలో మెడికల్/ఇంజనీరింగ్‌లకు ఒకే పరీక్ష

