ప్రతి సంవత్సరం వర్షాలు పడటం, వాతావరణం మారడంతో పాటు డెంగ్యూ జ్వరాలు కూడా నిశ్శబ్దంగా విజృంభిస్తుంటాయి. అయితే, ఇప్పటికీ చాలా మంది దీనిని ‘మామూలు జ్వరమే కదా’ అని లైట్ తీసుకుంటారు. కొంచెం నీరసం, ఒంటి నొప్పులు ఉంటాయి, నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే అనుకుంటారు. కానీ, డెంగ్యూ ఎప్పుడూ అంత సాధారణంగా ముగిసిపోదు. కొన్నిసార్లు ఇది ఊహించని విధంగా ప్రాణాల మీదికి తెచ్చే ప్రమాదం ఉంది.
దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధిని తక్కువ అంచనా వేయవద్దని వైద్యులు మరోసారి ప్రజలను హెచ్చరిస్తున్నారు. ముంబైలోని నారాయణ హెల్త్ ఎస్ఆర్‌సిసి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ కన్సల్టెంట్ డాక్టర్ అమోల్ జైభాయ్ ప్రకారం.. డెంగ్యూ జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే అది చాలా వేగంగా ముదిరి ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూ అనగానే కేవలం జ్వరం మాత్రమే అనుకుంటారు, కాస్త విశ్రాంతి తీసుకుని పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందని భావిస్తారు. కానీ ఇది సాధారణ జ్వరం కాదు, అంతకంటే చాలా తీవ్రమైనది అని స్పష్టం చేశారు.
ఏడెస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రారంభంలో సాధారణ జ్వరం, ఒంటి నొప్పులతో మొదలైనప్పటికీ.. క్రమంగా డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాలేయ సమస్యలు, అంతర్గత రక్తస్రావం మరియు ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా పడిపోవడానికి దారితీస్తుంది. కొన్ని తీవ్రమైన కేసుల్లో ఇది ‘షాక్ సిండ్రోమ్’కు కారణమై ప్రాణాలు తీయవచ్చు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మరియు ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి డెంగ్యూ మరింత ప్రమాదకరంగా మారుతుంది.
డెంగ్యూ వల్ల వచ్చే అతిపెద్ద సమస్య ఏమిటంటే.. సకాలంలో వైద్యం అందకపోవడం. జ్వరం ఒకటి రెండు రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుందని చాలా మంది ఇంట్లోనే ఉండిపోతారు. కానీ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
వరుసగా వాంతులు కావడం
ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం
తీవ్రమైన కడుపు నొప్పి
విపరీతమైన నీరసం మరియు అలసట
చిగుళ్ల నుండి రక్తం కారడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
చాలా మంది చేసే మరో పెద్ద తప్పు ‘సొంత వైద్యం’ . డాక్టర్ సలహా లేకుండా నొప్పులు, జ్వరం కోసం మెడికల్ షాపుల్లో దొరికే టాబ్లెట్లు వాడుతుంటారు. ప్లేట్‌లెట్స్ వేగంగా పడిపోతున్నప్పుడు లేదా రక్తస్రావం అయ్యే లక్షణాలు ఉన్నప్పుడు ఇలా సొంతంగా మందులు వాడటం ప్రాణాలకే ప్రమాదం. డెంగ్యూ చికిత్స అంటే కేవలం ప్లేట్‌లెట్ కౌంట్‌ను పరిశీలించడం మాత్రమే కాదు. రోగి యొక్క అన్ని లక్షణాలకు చికిత్స అందిస్తూ, వారు త్వరగా కోలుకునేలా చూడటం. దీనికి తక్షణ వైద్య సంరక్షణ చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. సరైన హైడ్రేషన్ (ద్రవ పదార్థాలు తీసుకోవడం), క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయడం, డాక్టర్ సూచించిన మందులు వాడటం వల్ల మాత్రమే దీని నుండి త్వరగా కోలుకోవచ్చు.
డెంగ్యూని పూర్తిగా నయం చేయడానికి ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేకమైన నిర్దిష్టమైన మందు లేదు. కాబట్టి, డెంగ్యూ బారిన పడకుండా ఉండటమే అత్యుత్తమ మార్గమని వైద్యులు చెబుతున్నారు.డెంగ్యూ దోమలు ఇళ్లలోని కూలర్లు, పూల కుండీలు, బకెట్లు, టెర్రస్‌లు, నిర్మాణ స్థలాలు మరియు ఇళ్ల చుట్టూ నిలిచి ఉండే నిల్వ నీటిలో పెరుగుతాయి. దోమలు గుడ్లు పెట్టడానికి ఇవి అత్యంత అనుకూలమైన ప్రదేశాలు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇంటి లోపల, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
పూల కుండీలలోని నీటిని క్రమంగా మారుస్తూ ఉండాలి.
దోమల నివారణ మందులు ఉపయోగించాలి.
చేతులు, కాళ్లు పూర్తిగా కప్పబడేలా దుస్తులు ధరించాలి.
ముఖ్యంగా వర్షాకాలంలో బాల్కనీలు, టెర్రస్‌లపై నీరు చేరకుండా శుభ్రం చేయాలి.
Also Read:చీకటిలో ఇండిగో విమానం!

