ఆదివారం రాత్రి వడోదర నుండి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానానికి విద్యుత్‌ను అందించే గ్రౌండ్ పవర్ సప్లై లో తలెత్తిన సమస్య వల్ల దాదాపు అరగంట పాటు క్యాబిన్‌లో కరెంట్, ఎయిర్ కండిషనింగ్ (AC) లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మే 17, ఆదివారం రాత్రి 8:40 గంటలకు వడోదర నుండి బయలుదేరాల్సిన ఇండిగో విమానం 6E 657 లో ఈ ఘటన జరిగింది. దాదాపు 160 మంది ప్రయాణికులు అప్పటికే విమానం ఎక్కేశారు. అయితే విమానం టేకాఫ్ కావడానికి ముందు, పార్కింగ్‌లో ఉన్న విమానాలకు విద్యుత్‌ను సరఫరా చేసే ‘గ్రౌండ్ పవర్ యూనిట్’ (GPU) పనిచేయడం ఆగిపోయిందని వేదించింది.
ఎయిర్‌పోర్ట్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఆ సమయంలో విమానం విద్యుత్ సరఫరా కోసం జీపీయూ (GPU) పైనే ఆధారపడింది. అయితే అదే సమయంలో ఆ సిస్టమ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజనీర్లు ఈ సాంకేతిక సమస్యను సరిచేయడానికి దాదాపు 12 నుండి 15 నిమిషాల సమయం పట్టింది. ఆ తర్వాత విమానానికి పూర్తిగా పవర్ రీస్టోర్ (పునరుద్ధరించడానికి) కావడానికి మరో 15 నిమిషాలు పట్టింది.
ఈ 30 నిమిషాల పాటు క్యాబిన్ మొత్తం పూర్తిగా చీకటిగా మారిపోయింది. ఏసీ కూడా పనిచేయకపోవడంతో ప్రయాణికులు విపరీతంగా చెమటలు కక్కారు అని సదరు అధికారి తెలిపారు. ఈ గందరగోళం జరుగుతున్నంత సేపు ప్రయాణికులు విమానంలోనే తమ సీట్లలో కూర్చుని ఉండిపోయారు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 8:40 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానం, చివరకు రాత్రి 10 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయింది. దీనివల్ల ప్రయాణికులు దాదాపు 1 గంట 20 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రయాణించాల్సి వచ్చింది.
ఈ ఘటనపై ఇండిగో ప్రతినిధి స్పందిస్తూ.. మే 17, 2026న వడోదర నుండి ఢిల్లీకి నడవాల్సిన ఇండిగో విమానం 6E 657 సాంకేతిక లోపం కారణంగా ఆలస్యమైంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాం, ఆ తర్వాత విమానం తన గమ్యస్థానానికి చేరుకుంది. ఆలస్యం జరుగుతున్న సమయంలో కస్టమర్లకు సమాచారం అందిస్తూనే ఉన్నాం. మా బృందాలు వారి అసౌకర్యాన్ని తగ్గించడానికి శాయశక్తులా ప్రయత్నించాయి. మా కస్టమర్లకు కలిగిన ఇబ్బందికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాము, వారి ఓపికకు మరియు అవగాహనకు కృతజ్ఞతలు. ఇండిగోలో మా కస్టమర్లు మరియు సిబ్బంది యొక్క భద్రత, సౌకర్యాలకే మా మొదటి ప్రాధాన్యత అని తెలిపారు.
Also Read:IPL:ప్లేఆఫ్స్ రేస్..హోరాహోరీ!

