ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ కీలకం!

3
- Advertisement -

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర రోజురోజుకూ కీలకమవుతోంది… ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనిశ్చితి, అస్థిరతల మధ్య భారత్ ఒక ఆశాకిరణంలా నిలుస్తోందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వ్యాఖ్యానించారు. జమైకాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఇండీస్’లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ వృద్ధిలో భారత్ తన వంతు సహకారాన్ని గణంకాతో సహా వివరించారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనాల ప్రకారం, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే మొత్తం ఆర్థిక వృద్ధిలో భారత్ వాటా 17 శాతంగా ఉండబోతోందని జైశంకర్ తెలిపారు. ప్రపంచ వృద్ధికి అత్యధికంగా సహకరిస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు వంటి పరిస్థితుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత్ తన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటోందని చెప్పారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. ఇప్పుడు భారత్ తయారీ రంగంలో రాణిస్తూ ప్రపంచానికి నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది అన్నారు.

ప్రస్తుతం భారత్‌లో దాదాపు 1,800 GCCలు ఉన్నాయని, వీటి ద్వారా ఏటా 70 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను భారత్ తీరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు చూసుకోవడం అంటే ప్రపంచానికి అన్యాయం చేయడం కాదని జైశంకర్ స్పష్టం చేశారు.

Also Read:రక్తం గడ్డకట్టడం..ప్రమాదకర సంకేతాలు!

తమను తాము చూసుకుంటూనే ప్రపంచానికి మేలు చేయవచ్చని భారత్ నిరూపిస్తోంది అని ఆయన అన్నారు. గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) గొంతుకను ప్రపంచ వేదికలపై బలంగా వినిపించడంలో భారత్ ముందుంటోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

- Advertisement -