TN:ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేది ఎవరు?

3
- Advertisement -

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, మేజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.

234 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీకి 118 స్థానాలు అవసరం. విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. మెజారిటీకి కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. విజయ్ కు కాంగ్రెస్ పార్టీ (5 స్థానాలు) ఇప్పటికే బహిరంగంగా మద్దతు ప్రకటించింది. దీంతో టీవీకే బలం 113కు చేరింది. మరో 5 సీట్ల కోసం ఇతర చిన్న పార్టీలైన వీసీకే (VCK), సీపీఐ, సీపీఎం మద్దతు కోసం చర్చలు జరుగుతున్నాయి.

ఏఐఏడీఎంకే (AIADMK) అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) తన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహించారు. మంచి రోజులు రాబోతున్నాయి అంటూ ఎమ్మెల్యేలకు భరోసా ఇస్తూనే, తమ పార్టీ ఉనికిని కాపాడుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. విజయ్ ని అధికారానికి దూరం చేసేందుకు గత 50 ఏళ్లుగా బద్ధశత్రువులుగా ఉన్న డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే చేతులు కలిపే అవకాశం ఉందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

Also Read:రక్తం గడ్డకట్టడం..ప్రమాదకర సంకేతాలు!

అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, చిన్న పార్టీల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఒక వర్గం వాదిస్తోంది. డీఎంకే, ఏఐఏడీఎంకే కలిసి ఒక కూటమిగా ఏర్పడితే, వారి సంఖ్యా బలం ఎక్కువగా ఉండి విజయ్ కి ఇబ్బందులు తప్పవని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు గవర్నర్ నిర్ణయం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. విజయ్ తన సంఖ్యా బలాన్ని నిరూపించుకుని పీఠం ఎక్కుతారా? లేక ద్రవిడ పార్టీలు ఏకమై కొత్త సమీకరణాలకు తెరలేపుతాయా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.

- Advertisement -