బెంగాల్‌లో CAA అమలు చేస్తాం:మోదీ

10
- Advertisement -

పశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్ (TMC)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను తిన్న ‘జల్మురి’ (ఒక రకమైన స్నాక్) అధికార పార్టీకి “పెద్ద షాక్” ఇచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. టీఎంసీ ప్రభుత్వం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తోందని, రాష్ట్రంలో “మహా జంగిల్ రాజ్” నడుస్తోందని ఆరోపించిన మోదీ.. మతువా మరియు నమశూద్ర వర్గాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) ద్వారా పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని ఆయన ప్రకటించారు.

ఏప్రిల్ 19న ఝర్‌గ్రామ్‌లో మోదీ జల్మురి తిన్న సందర్భాన్ని గుర్తుచేస్తూ.. నేను జల్మురి తిన్నాను, కానీ ఆ కారం (జల్) మాత్రం టీఎంసీకి తగిలింది అని చమత్కరించారు. మే 4న (ఎన్నికల ఫలితాల రోజు) బెంగాల్‌లో బీజేపీ విజయోత్సవాలు జరుగుతాయని, అప్పుడు కూడా జల్మురి పంచుతామని ధీమా వ్యక్తం చేశారు.బీజేపీ ‘సబ్‌కా సాత్, సబ్ కా వికాస్’ నమ్ముతుందని, కానీ టీఎంసీ ‘ఘుస్‌పైతియో కా సాత్, ఘుస్‌పైతియో కా వికాస్’ (చొరబాటుదారులతో కలిసి, వారి అభివృద్ధి)ని నమ్ముతుందని మోదీ ఆరోపించారు.

మతువా, నమశూద్ర కమ్యూనిటీలు మరియు శరణార్థి కుటుంబాలు టీఎంసీకి భయపడాల్సిన అవసరం లేదని మోదీ భరోసా ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే సీఏఏ ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి శరణార్థికి భారత పౌరులకు లభించే అన్ని హక్కులు, ప్రయోజనాలు కల్పిస్తామని ఇది ‘మోదీ గ్యారెంటీ’ అని చెప్పారు.గత 50 ఏళ్లలో హింస అతి తక్కువగా నమోదైన ఎన్నికలు ఇవేనని మోదీ పేర్కొన్నారు. శాంతియుత ఓటింగ్ కోసం కృషి చేస్తున్న ఎన్నికల కమిషన్‌ను ఆయన అభినందించారు.

Also Read:భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

పుదుచ్చేరి, అస్సాంలలో అధిక ఓటింగ్ నమోదు కావడాన్ని ప్రస్తావిస్తూ.. ఓటింగ్ శాతం పెరిగిన చోటల్లా బీజేపీకి భారీ మెజారిటీ దక్కుతుందని, బెంగాల్‌లోనూ అదే రిపీట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.పశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని ఓడించి బెంగాల్ గడ్డపై పాగా వేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -