గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు త్వరలోనే భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఈక్విటీస్ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం, భారత్‌లో లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఏకంగా రూ. 25 నుండి రూ. 28 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ పెంపు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇజ్రాయెల్ మరియు ఇతర పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ఉత్పత్తి మరియు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రపంచవ్యాప్త చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ కెనాల్ మూసివేత భయాలు మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. ఇక్కడి నుండి చమురు ట్యాంకర్ల రాకపోకలు ఆగిపోతే, సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింటుంది.అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. చమురు కంపెనీలు ప్రస్తుతం నష్టాలను భరిస్తున్నాయని, ఎన్నికల తర్వాత ఆ భారాన్ని వినియోగదారులపై వేయక తప్పదని నివేదిక పేర్కొంది.
Also Read:సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్లు
సాధారణంగా ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ధరలను నియంత్రిస్తుంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరల వల్ల చమురు కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. కోటక్ ఈక్విటీస్ విశ్లేషణ ప్రకారం, తమ నష్టాలను పూడ్చుకోవడానికి కంపెనీలు భారీగా ధరలను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఒకవేళ లీటర్ పెట్రోల్ ధర రూ. 25కు పైగా పెరిగితే, అది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, మరియు ఇతర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది.

