ఇరాన్‌లో సుదీర్ఘకాలం పాటు కొనసాగే ఘర్షణలు ఉక్రెయిన్ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ హెచ్చరించారు. ముఖ్యంగా అమెరికా నుండి రావాల్సిన కీలకమైన యాంటీ మిసైల్ డిఫెన్స్ (క్షిపణి నిరోధక) వ్యవస్థల సరఫరాకు ఇది ఆటంకం కలిగించవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఓ ఇంటర్వ్యూలో జెలెన్స్కీ మాట్లాడుతూ.. అమెరికాలో ఉత్పత్తి పరిమితుల కారణంగా కీవ్ ఇప్పటికే తక్కువ సంఖ్యలో ఆయుధాలను అందుకుంటోందని వివరించారు. ప్రస్తుతానికి నిఘా సమాచారం లేదా సరఫరాల్లో ఎటువంటి అంతరాయం కలగకపోయినప్పటికీ, భవిష్యత్తుపై ధీమా లేదని అన్నారు.
నాటో (NATO) సభ్య దేశాలు ఉక్రెయిన్ కోసం ఆయుధాల కొనుగోలుకు నిధులు సమకూర్చే PURL ప్రోగ్రామ్ ద్వారా ఉక్రెయిన్ అమెరికన్ హార్డ్‌వేర్‌ను పొందుతోంది. దీని ద్వారా పేట్రియాట్ వ్యవస్థలకు అవసరమైన యాంటీ బాలిస్టిక్ క్షిపణులను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మధ్యప్రాచ్యంలో, ముఖ్యంగా ఇరాన్‌తో యుద్ధం తీవ్రమైతే, అమెరికా వనరులు అటువైపు మళ్లుతాయని, తద్వారా ఉక్రెయిన్‌కు అందే రక్షణ ప్యాకేజీలు ప్రమాదంలో పడతాయని జెలెన్స్కీ హెచ్చరించారు. “మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగినా లేదా కాల్పుల విరమణ ఆలస్యమైనా.. అది మాకు మంచిది కాదు” అని ఆయన అన్నారు.
Also Read:భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
అమెరికాలో ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఇప్పటికే తమకు అందాల్సిన వ్యవస్థలు పరిమితంగానే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. రష్యా ఉపయోగిస్తున్న ఇరానియన్ డ్రోన్లను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ సంపాదించిన నాలుగేళ్ల అనుభవాన్ని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని మధ్యప్రాచ్య దేశాలకు పంచుకుంటున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ఇప్పటికే సౌదీ అరేబియా, ఖతార్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లతో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయని ఆయన వెల్లడించారు.వచ్చే రోజుల్లో ఇతర దేశాలకు కూడా తమ నైపుణ్యాన్ని అందించడానికి మరియు శిక్షణ ఇచ్చేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని జెలెన్స్కీ స్పష్టం చేశారు.

