ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం ఎంఎస్ ధోనీ పునరాగమనంపై నెలకొన్న ఉత్కంఠకు టీమ్ ఇండియా స్పిన్నర్ ఆర్. అశ్విన్ తెరదించారు. ధోనీ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని, ముంబై ఇండియన్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో ఆయన ఆడటం ఖాయమని అశ్విన్ స్పష్టం చేశారు.
తన యూట్యూబ్ ఛానెల్ ‘యాష్ కీ బాత్’లో అశ్విన్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నేను ఎంఎస్ ధోనీని నెట్స్‌లో వికెట్ కీపింగ్ గ్లౌవ్స్ ధరించి ప్రాక్టీస్ చేయడం ఎప్పుడూ చూడలేదు. ఆయన ఇప్పుడు నెట్స్‌లో కీపింగ్ చేస్తున్నారంటే, సంజూ శాంసన్ స్థానంలో కీపింగ్ చేస్తారని లేదా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తారని అర్థం. ఆయన 100 శాతం ఆడతారని నేను ఖచ్చితంగా చెప్పగలను అని అశ్విన్ అన్నారు.
కాఫ్ స్ట్రెయిన్ (కాలి కండరాల గాయం) కారణంగా ధోనీ ఇప్పటివరకు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు. అయితే, ఆయన నెట్స్‌లో బ్యాటింగ్ చేయడమే కాకుండా, వార్మప్ సమయంలో పరిగెత్తుతున్నారని, ఇది ఆయన ఫిట్‌నెస్‌కు నిదర్శనమని అశ్విన్ పేర్కొన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఫినిషింగ్‌లో తడబడటాన్ని అశ్విన్ గుర్తు చేశారు.
ఒకవేళ చివరి 5 బంతుల్లో 15 పరుగులు కావాల్సి వస్తే, ఆ పనిని ధోనీ ఇప్పటికీ చేయగలడు. ఆయన ఆఖర్లో సిక్సర్లు బాదగలడు. ధోనీ ఆడాలనుకుంటే ఆయనను జట్టుకు దూరం చేయడం ఎవరి వల్ల కాదు అని అశ్విన్ వ్యాఖ్యానించారు.ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి, 4 పాయింట్లతో పట్టికలో 8వ స్థానంలో ఉంది. జట్టులో గాయాల సమస్యలు, ఫామ్ లేమి వేధిస్తున్న తరుణంలో ధోనీ రాక జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read:పిల్లలకు మాటలు ఆలస్యమవ్వడం ఆటిజమా?
గురువారం ముంబై ఇండియన్స్‌తో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ధోనీ మైదానంలోకి అడుగుపెడితే, అది సీఎస్‌కేకు పెద్ద ఊరటనిచ్చే విషయమే.

