TCS వేధింపుల కేసు..అప్‌డేట్!

3
- Advertisement -

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ యూనిట్‌లో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో కంపెనీ ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ అయిన టీసీఎస్‌లో వేధింపుల పట్ల ‘జీరో టాలరెన్స్’ (సహించేది లేదు) విధానం ఉందని కంపెనీ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాసిక్ యూనిట్‌లో ఒక సీనియర్ సహోద్యోగి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగికి, ఆ విషయాన్ని అక్కడితో వదిలేయాలని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు సలహా ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

బాధితురాలు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని. నాసిక్ యూనిట్‌లోని లోన్స్ బ్రాంచ్ టీమ్ లీడ్ రజా మీమన్, ఆమెపై కన్నేసి వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు.
శిక్షణ గదిలో ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యంగా ప్రవర్తించడం, రహస్యంగా ఉంచమని ఒత్తిడి చేయడం వంటి పనులకు రజా పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై ట్రైనింగ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయగా “రజా క్యారెక్టర్ ఇప్పటికే బాగోలేదు.. నువ్వే జాగ్రత్తగా ఉండు, ఒంటరిగా ఉండకు” అని సరిపెట్టారు. తమపై ఫిర్యాదు చేసిందన్న కక్షతో రజా మరియు మరికొందరు సహోద్యోగులు బాధితురాలిపై తప్పుడు ప్రచారానికి దిగారు. ఆమెకు ఒక పురుష సహోద్యోగితో అక్రమ సంబంధం ఉందని కార్యాలయంలో పుకార్లు పుట్టించారు. ఆమె వ్యక్తిగత జీవితంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

తనపై జరుగుతున్న వేధింపుల గురించి బాధితురాలు హెచ్ఆర్ హెడ్ మరియు ఆపరేషన్స్ మేనేజర్ అశ్విని చైనాని వద్దకు వెళ్లగా, ఆయన విస్మయకరమైన సమాధానం ఇచ్చారు. “నువ్వు ఎందుకు స్పాట్‌లైట్‌లో ఉండాలనుకుంటున్నావు? ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయ్.. డ్రాప్ చెయ్” అని ఆమెకు హితవు పలికారు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఎనిమిది మందిలో అశ్విని చైనాని కూడా ఒకరు.

బాధితురాలు నిందితుడితో మాట్లాడటం మానేయడంతో, వారు టెక్నికల్ వేధింపులకు దిగారు. ఆఫీస్ సిస్టమ్‌ను ట్యాంపర్ చేసి, ఆమెకు వచ్చే కాల్స్ ఫ్రీక్వెన్సీని సెకనుకు ఒకటి చొప్పున పెంచారు. తద్వారా ఆమె పని ఒత్తిడితో మానసిక కుంగుబాటుకు లోనయ్యేలా ప్లాన్ చేశారు.ఈ వ్యవహారంలో తమ అంతర్గత ఛానెల్స్ ద్వారా ఎలాంటి ఫిర్యాదులు అందలేదని టీసీఎస్ యాజమాన్యం చెబుతోంది. కాగా, రజా మీమన్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆఫీస్ పాలిటిక్స్ అని, అతను మంచి పర్ఫార్మర్ కాబట్టే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాదిస్తున్నారు.

Also Read:పిల్లలకు మాటలు ఆలస్యమవ్వడం ఆటిజమా?

ప్రస్తుతం నాసిక్ పోలీసులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి, ఈ యూనిట్‌లో మహిళా ఉద్యోగులపై జరిగిన మానసిక మరియు లైంగిక వేధింపులకు సంబంధించి మొత్తం 9 కేసులపై విచారణ జరుపుతున్నారు.

- Advertisement -