తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో… దేశ రాజకీయాలు, నియోజకవర్గాల పునర్విభజన మరియు ఎన్నికల సంస్కరణలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జనాభా ప్రాతిపదికన వెళ్తే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, అందుకే కేంద్రం ఇప్పుడు ఉన్న సీట్లకు 50 శాతం పెంచేలా కొత్త విధానాన్ని ప్రతిపాదిస్తోందని ఆయన తెలిపారు. పునర్విభజనలో 50 శాతం జనాభాను, 50 శాతం జీఎస్టీ (GST) చెల్లింపులను ప్రాతిపదికగా తీసుకోవాలని పలు రాష్ట్రాలు కేంద్రానికి సూచిస్తున్నాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ బిల్లును వేరువేరుగా పెట్టాలని రాష్ట్రాలు కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక (One Nation, One Election) విధానంపై స్పందిస్తూ, ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోతే.. 18 రాష్ట్రాలకు ఒక విడతలో, మిగిలిన రాష్ట్రాలకు మరో విడతలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని గుత్తా విశ్లేషించారు.
ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేయకపోతే, భవిష్యత్తులో సామాన్యుడు రాజకీయాల్లో పోటీ చేసే పరిస్థితి ఉండదు. రాజకీయాలు కేవలం ధనవంతులకే పరిమితం కాకూడదు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల వారికి ఆశ్రయమిస్తోందని గుత్తా తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షల మంది కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నారని, ఇది రాష్ట్ర ఆర్థిక బలానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
జనాభాతో పాటు జీఎస్టీ వాటాను కూడా పరిగణనలోకి తీసుకోవాలి..మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దు అని సూచించారు గుత్తా. అలాగే సామాన్యుడు పోటీ చేయాలంటే ధన ప్రభావం తగ్గాలి అన్నారు.
Also Read:తమిళనాడు సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ

