అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా సమర్పించారు. తన నివాసంలో నగదు వెలుగులోకి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై అంతర్గత విచారణ కొనసాగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత సంవత్సరం మార్చిలో ఢిల్లీ నివాసంలో కాలిపోయిన నగదు కట్టలు వెలుగులోకి రావడంతో జస్టిస్ యశ్వంత్ వర్మపై వివాదం మొదలైంది. ఈ ఘటన అనంతరం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఏప్రిల్ 5న ఆయన అక్కడ న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కేసులో పార్లమెంట్ ద్వారా తొలగింపు చర్యలు (ఇంపీచ్మెంట్) చేపట్టే అవకాశాల నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది.లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గత నెలలో మూడు సభ్యుల కమిటీని పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, బొంబాయి హైకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్,
కర్ణాటక హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ బీవీ ఆచార్య ఉన్నారు.
ఇంపీచ్మెంట్ ప్రక్రియను జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. రాజ్యసభ ఛైర్మన్ అనుమతి లేకుండా కమిటీని ఏర్పాటు చేయడం సరికాదని వాదించారు.అయితే, సుప్రీంకోర్టు ఈ వాదనను తిరస్కరించింది. “చట్టాన్ని పార్లమెంట్ ప్రక్రియను అడ్డుకునే ఆయుధంగా ఉపయోగించరాదు” అని స్పష్టం చేసింది.
Also Read:KTR:జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం
సుప్రీంకోర్టు తీర్పులో, న్యాయమూర్తులకు ఉన్న రాజ్యాంగ రక్షణలు తొలగింపు ప్రక్రియను నిలిపివేయడానికి కారణం కావు అని పేర్కొంది.రెండు సభల్లో ఒకే రోజున నోటీసులు ఇచ్చిన సందర్భంలో, ఒక సభలో ఆమోదం లేకపోయినా స్పీకర్ లేదా ఛైర్మన్ స్వతంత్రంగా కమిటీని ఏర్పాటు చేయవచ్చని స్పష్టం చేసింది.మొత్తంగా నగదు వివాదం నేపథ్యంలో న్యాయమూర్తి యశ్వంత్ వర్మ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

