సందిగ్ధంలో అజారుద్దీన్ మంత్రి పదవి!

4
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో మహమ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవి ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 30లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సిన గడువు దగ్గరపడుతుండటంతో ఆయన భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.

ఇటీవల ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు… హైకోర్టులో తేల్చుకోవాలని సూచించగా, తెలంగాణ హైకోర్టులో కేసు విచారణకు వెళితే మరో 3-4 నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో గడువు ముగిసేలోపు పరిష్కారం దొరకకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. గడువు ముగిసేలోపు అజారుద్దీన్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించి, మే 16 తర్వాత జరిగే కేబినెట్ విస్తరణలో మళ్లీ అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

అయితే మే 16లోపు గవర్నర్ అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవికి ఆమోదం తెలుపుతారా లేదా అన్నది కూడా అనిశ్చితిగా మారింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి.

ఇక HCAలో జరిగిన రూ.20 కోట్ల అవకతవకల కేసు కూడా అజారుద్దీన్‌కు ఇబ్బందిగా మారింది. గతంలో ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో మే నెలలో కూడా అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే నవంబర్ 14న పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, వారి స్థానంలో అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నియమించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Also Read:KTR:డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం..కానీ!

ఇదే సమయంలో, గవర్నర్ ఆమోదం, హెచ్సీఏ కేసు, సుప్రీంకోర్టు తీర్పు వంటి అంశాల నేపథ్యంలో అజారుద్దీన్‌ను జూబ్లీహిల్స్ రాజకీయాల్లో ఒక పావుగా ఉపయోగించుకున్నారనే చర్చలు మైనార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొత్తంగా, న్యాయపరమైన, రాజకీయ అడ్డంకుల మధ్య అజారుద్దీన్ మంత్రి పదవి భవిష్యత్తు అనిశ్చితిలో కొనసాగుతోంది.

- Advertisement -