ఐపీఎల్ జట్టు ఆర్‌సీబీ యాజమాన్యంలో భారీ మార్పు చోటుచేసుకుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును పూర్తిగా సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ సుమారు 1.78 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16,706 కోట్లు)గా ఉంది.
ఇప్పటివరకు ఆర్‌సీబీని నిర్వహిస్తున్న యునైటైడ్ స్పిరిట్స్ లిమిటెడ్ తమ 100 శాతం వాటాను విక్రయించింది. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ కొత్త ఛైర్మన్‌గా ఆర్యమన్ బిర్లా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆయన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు.
ఆర్యమన్ బిర్లా 1997 జూలై 9న జన్మించారు. ఆయన ఒక వ్యాపారవేత్త మాత్రమే కాకుండా మాజీ ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా. దేశీయ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఎడమచేతి బ్యాట్స్‌మన్‌గా ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడారు. 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 414 పరుగులు చేసి ఒక శతకం కూడా నమోదు చేశారు.
ప్రస్తుతం ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్‌తో కలిసి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా కూడా ఆడిన అనుభవం ఆయనకు ఉంది. ఆర్యమన్ బిర్లా 2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరారు. మంచి ప్రతిభ చూపించినప్పటికీ, 2019లో మానసిక ఆరోగ్య కారణాలతో ప్రొఫెషనల్ క్రికెట్‌కు విరామం ప్రకటించారు. ఈ నిర్ణయం భారత క్రీడల్లో మానసిక ఆరోగ్యంపై చర్చకు దారి తీసింది.
Also Read:KTR:డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం..కానీ!
క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత ఆర్యమన్ బిర్లా వ్యాపార రంగంపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ-కామర్స్, రిటైల్ రంగాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. స్టార్టప్‌లు, డిజిటల్ ఇన్నోవేషన్‌లపై ఆసక్తి చూపుతూ, కొత్త తరం వ్యాపారవేత్తగా ఎదుగుతున్నారు. ఆర్‌సీబీని పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో, జట్టు నిర్వహణలో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది. పురుషుల జట్టుతో పాటు మహిళల (WPL) జట్టును కూడా ఈ ఒప్పందంలో భాగంగా తీసుకున్నారు.

