Q నెట్ కార్యాలయాలపై పోలీసుల దాడులు

6
- Advertisement -

మల్టీ లెవెల్ మార్కెటింగ్ (MLM) పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న QNet కార్యాలయాలపై సీసీఎస్ పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో చేపట్టిన ఈ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరులో కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌లో తెల్లవారుజాము నుంచే పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆరు ప్రాంతాల్లో సమాంతరంగా సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల క్యూ నెట్‌కు సంబంధించిన మోసాలపై రెండు కొత్త కేసులు నమోదవడంతో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట అమాయకులను ఆకర్షించి వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికుతూ పలువురిని మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదులు చేశారు.

ఈ కేసులో ఇప్పటికే 20 మంది నిందితులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వీరిలో కొందరు కీలక నిర్వాహకులు, రిక్రూట్‌మెంట్ నెట్‌వర్క్ నిర్వహించినవారిగా అనుమానిస్తున్నారు. సీజ్ చేసిన డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలను పరిశీలిస్తూ మోసానికి సంబంధించిన పూర్తి స్థాయి నెట్‌వర్క్‌ను బయటపెట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ మోసపూరిత వ్యవస్థలో సభ్యులను చేర్చుకుంటూ చైన్ సిస్టమ్ ద్వారా డబ్బు సేకరించడం ప్రధాన లక్ష్యంగా పనిచేసినట్లు గుర్తించారు. పెట్టుబడిదారులకు సరైన వ్యాపార కార్యకలాపాలు లేకపోయినా అధిక లాభాల వాగ్దానాలతో మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

Also Read:రోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధిక లాభాల పేరుతో వచ్చే ఇలాంటి స్కీమ్స్‌పై నమ్మకం పెట్టుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముంది.

- Advertisement -