నగరంలోని ఆస్తి పన్ను వసూళ్లపై కీలక వివరాలు వెల్లడించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటివరకు మొత్తం రూ.2,184 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసినట్లు తెలిపారు. నగరంలో మొత్తం 28 లక్షల 20 వేల ఆస్తులు ఉండగా, అందులో 18 లక్షల ఆస్తులకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పటికే చెల్లించబడినట్లు చెప్పారు.
ప్రస్తుతం ఆస్తి పన్ను చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఓటీఎస్ (One Time Settlement) పథకాన్ని అమలు చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు. ఈ పథకం కింద పాత బకాయిలపై ఉన్న వడ్డీపై 90 శాతం వరకు రాయితీ ఇస్తున్నామని తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు రూ.134 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు చేసినట్లు వెల్లడించారు.
పన్ను బకాయిలు చెల్లించని మొండి బకాయిదారులను సర్కిల్, జోన్ల వారీగా గుర్తిస్తున్నామని చెప్పారు. వారికి ఇప్పటికే నోటీసులు పంపిస్తున్నామని, నోటీసులకు స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నులను వెంటనే చెల్లించాలని నగరవాసులకు సూచించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,766 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాల్సి ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన భవనాల ఆస్తి పన్ను దశల వారీగా చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భవనాల ఆస్తి పన్నును ప్రభుత్వంతో బుక్ అడ్జస్ట్మెంట్ ద్వారా సర్దుబాటు చేస్తున్నట్లు వివరించారు.
ఇటీవల నిర్వహించిన జీఐఎస్ సర్వేలో నగరంలోని అనేక ఆస్తుల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాపర్టీ వివరాల్లో తేడాలు ఉన్న లక్షా 20 వేల ఆస్తులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
Also Read:ప్రపంచ దేశాల మధ్య మరో వార్!
ఆస్తి పన్నును ప్రజలు సులభంగా చెల్లించేందుకు MyGHMC యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చెల్లించే అవకాశం ఉందని చెప్పారు. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్‌ను కేవలం ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు లేదా బిల్ కలెక్టర్లు మాత్రమే వసూలు చేయాలని, ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ వసూలు చేయరాదని స్పష్టం చేశారు.
ఇక నగర శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మూడు కార్పొరేషన్లు కలిసి పనిచేస్తున్నాయని, ముఖ్యంగా శానిటేషన్‌పై ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు. శానిటేషన్ సమస్యలపై ప్రజలు వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ తెలిపారు.

