ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడు కొత్త పోటీ మొదలైంది. అది అణు ఆయుధాల కోసం కాదు… కృత్రిమ మేధస్సు (AI) ఆధిపత్యం కోసం. అమెరికా, చైనా, యూరప్ దేశాలు ప్రపంచ టెక్నాలజీ శక్తి సమీకరణాలను మళ్లీ పునర్నిర్మిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని చాలా మంది AI కోల్డ్ వార్ గా అభివర్ణిస్తున్నారు.
ప్రస్తుతం AI శక్తి నాలుగు కీలక అంశాలపై ఆధారపడి ఉంది. అవి కంప్యూటింగ్ , చిప్స్, డేటా, ప్రతిభ . ఈ నాలుగు రంగాల్లో ఎవరు ముందుంటే వారు AI రంగంలో ఆధిపత్యం సాధించే అవకాశముంది.
కంప్యూటింగ్.. ఈ రంగంలో అమెరికా స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉంది. ప్రపంచ AI కంప్యూటింగ్ సామర్థ్యంలో సుమారు 75 శాతం అమెరికాలోనే ఉంది. చైనా దాదాపు 14–15 శాతం సామర్థ్యంతో రెండో స్థానంలో ఉంది. యూరప్ వాటా ఐదు శాతం కంటే తక్కువ. పెద్ద డేటా సెంటర్ల ద్వారా అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ఈ రంగాన్ని నియంత్రిస్తున్నాయి.
చిప్స్..AI అభివృద్ధికి అవసరమైన సెమీకండక్టర్ చిప్స్ తయారీలో NVIDIA, AMD, Intel వంటి అమెరికా సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా పురోగతిని అడ్డుకునేందుకు అమెరికా 2022 నుంచి అధునాతన చిప్స్ ఎగుమతిపై పరిమితులు విధించింది. అయినప్పటికీ చైనా కంపెనీలు ఇతర దేశాల్లోని క్లౌడ్ సేవలను ఉపయోగిస్తూ మార్గాలు కనుగొంటున్నాయి.
డేటా పరంగా చైనాకు పెద్ద ప్రయోజనం ఉంది. అక్కడ ఒక బిలియన్ కంటే ఎక్కువ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. Alibaba, Tencent వంటి భారీ డిజిటల్ ప్లాట్‌ఫార్ములు చైనాకు విస్తృత డేటాను అందిస్తున్నాయి. మరోవైపు యూరప్ “డేటా సార్వభౌమత్వం”పై దృష్టి పెట్టి స్థానిక డేటా సెంటర్లలోనే సమాచారాన్ని నిల్వ చేయాలనే విధానాన్ని అనుసరిస్తోంది.
Also Read:2027 వరల్డ్ కప్ గెలవడమే టార్గెట్!
AI రంగంలో ప్రతిభ విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. తరువాత చైనా, భారత్, దక్షిణ కొరియా, యూకే ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో AI నిపుణుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో AIలో ఎవరు గెలుస్తారో అనేది కేవలం ఉత్తమ అల్గారిథమ్‌లపై ఆధారపడదు. AIను నడిపించే యంత్రాలు, డేటా సెంటర్లు, చిప్స్ వంటి మౌలిక సదుపాయాలను ఎవరు నియంత్రిస్తారో వారే నిజమైన టెక్నాలజీ సూపర్‌పవర్‌గా నిలుస్తారు.

