ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, ఉద్యమకారుడు నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అవార్డు లభించింది. వచన కవిత్వం విభాగంలో ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించారు. తెలంగాణ సాహిత్య రంగంలో విశిష్టమైన సేవలందించిన నందిని సిధారెడ్డి ఈ అవార్డుతో మరోసారి గౌరవం పొందారు.
ఆయన రచించిన “అనిమేష” కవితా సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ ఈ అవార్డును ప్రకటించింది. ఈ కవితా సంకలనంలో తెలంగాణ సంస్కృతి, సమాజం, ప్రజల జీవన విధానం, భావోద్వేగాలు ప్రతిబింబించేలా కవితలు రచించినట్లు సాహిత్య వర్గాలు చెబుతున్నాయి. సాహిత్యంలో ఆయన ప్రత్యేక శైలితో, సామాజిక అంశాలపై స్పందించే కవిత్వంతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నందిని సిధారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జరిగిన ఉద్యమ కాలంలో ఆయన రచనలు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చాయి. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థాపించిన తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి చైర్మన్‌గా కూడా సేవలందించారు.
సిధారెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లాలోని బందారం. గ్రామీణ నేపథ్యంలో పెరిగిన ఆయనకు చిన్నప్పటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి తరువాత గొప్ప కవిగా, రచయితగా ఆయనను నిలబెట్టింది. ఈ అవార్డు లభించడంతో తెలంగాణ సాహిత్య వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పలువురు రచయితలు, కవులు, సాహిత్యాభిమానులు నందిని సిధారెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నారు.
Also Read:రూ.2,184 కోట్ల ఆస్తి పన్ను వసూలు:ఆర్వీ కర్ణన్

