తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికై తర్వాత కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై దాఖలైన అనర్హత పిటిషన్లలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్‌పై ఎమ్మెల్యేగా గెలిచి, తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని అన్నారు. ప్రజలు ఇచ్చిన మాండేట్ను ఇలా తేలికగా తీసుకోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలాంటి నిర్ణయాల ద్వారా స్పీకర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కూడా కేటీఆర్ ఆరోపించారు. ఇది కేవలం ఒక తీర్పు మాత్రమే కాకుండా అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారనే భావనను కలిగిస్తోందని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనర్హత పిటిషన్లపై తుది నిర్ణయం ప్రకటిస్తూ దానం నాగేందర్, కడియం శ్రీహరిలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తూ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇదే తరహాలో గతంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకూ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్, అలాగే వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తన కుమార్తె కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం చేసిన కడియం శ్రీహరి వ్యవహారాలపై ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
Also Read:వార్ ఎఫెక్ట్..యూరియాపై కూడా!
ఈ నిర్ణయంపై స్పందించిన కేటీఆర్, తెలంగాణ ప్రజలు జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో తమ తీర్పు చెబుతారని అన్నారు. దీంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

