ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్లపై పడుతుండగా, దాని ప్రభావం భారత్‌లోని వంట గ్యాస్ సరఫరాపై కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్య తలెత్తడంతో హోటల్, రెస్టారెంట్ రంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గ్యాస్ సరఫరా పరిమితులు ఉండటంతో నగరంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడిందని యాజమాన్యాలు చెబుతున్నాయి.
హైదరాబాద్‌లో సుమారు 20 వేల హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా, వాటిలో దాదాపు 6 వేల వరకు స్టార్ హోటళ్లు ఉన్నట్లు అంచనా. ఈ హోటల్ రంగంపై నేరుగా, పరోక్షంగా దాదాపు 18 లక్షల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. గ్యాస్ సరఫరా సమస్యలు కొనసాగితే ఈ రంగం తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ఇక నగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో ఉన్న హాస్టళ్లలో కూడా గ్యాస్ కొరత ప్రభావం కనిపిస్తోంది. హాస్టల్ అసోసియేషన్ సభ్యులు నివాసితులకు సందేశం పంపుతూ ఇకపై కేవలం ముఖ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే అందిస్తామని తెలిపారు. ఎక్కువ సమయం పట్టే టిఫిన్స్ మరియు ఇతర ఫుడ్ ఐటమ్స్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే హాస్టల్ గదుల్లో సొంతంగా వంట చేసుకోవడానికి కూడా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరే వరకు ఈ నియమాలు కొనసాగుతాయని హాస్టల్ యాజమాన్యాలు వెల్లడించాయి.
Also Read:సత్యవతిగా రీతు!

