నెత్తిన బోనం ఎత్తి, మనసంతా అమ్మవారిని స్మరిస్తూ తరలివచ్చిన భక్తజనంతో లష్కర్ పోటెత్తింది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర అంగరంగవైభవంగా జరుగుతోంది. ఇక అమ్మవారి బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం వైభవంగా జరిగింది. పచ్చి కుండపై నిలబడిన స్వర్ణలత అమ్మవారిని తనలోకి ఆవాహన చేసుకుని భవిష్యవాణిని వినిపించింది. తాను సంతోషంగానే ఉన్నానని, తనకు జరుగుతున్న పూజలు ఆనందాన్ని కలిగిస్తున్నాయని అమ్మ పలికింది.
తన ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లేలా చూస్తానని, ఎటువంటి ఆపదా రానివ్వకుండా చూసుకుంటానని వరమిచ్చింది. రాబోయే రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయని, పాడి పంటలు బాగుంటాయని సెలవిచ్చింది. కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుంటుందని, తనను బాగా చూసుకుంటున్న పాలకులపై తన కరుణ ఉంటుందని, తనకు పెట్టే వారికి అనారోగ్యం రానివ్వబోనని, ఒకరిని తక్కువగా, ఒకరిని ఎక్కువగా చూడనని, తక్కువ సేవ చేసినా, ఎక్కువ సేవ చేసినా, అందరూ తన బిడ్డలేనని స్వర్ణలతను ఆవహించిన అమ్మవారు పలికింది. తనకు జరిగే పూజల్లో కొంత లోటు కనిపిస్తోందని, అది మాత్రం అసంతృప్తిగా ఉందని చెప్పింది.
ఆషాఢ మాసంలో ఆనవాయితీగా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి కూడా ఘనంగా అంకురార్పణ జరిగింది. ఆదివారం తొలిపొద్దున అమ్మవారి జాతర వైభవంగా మొదలైంది. డప్పుచప్పుళ్లు,. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జై మహంకాళమ్మ నినాదాలు మార్మోగుతుండగా.. ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివెరిసింది.