షాదీ డాట్ కామ్”తో సైబర్ నేరాలకు మార్గం సులువుగా మారింది అని షాదీ డాట్ కామ్ కేసు విచారణలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. షాదీ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో యానాం ఎమ్మెల్యే ఫోటోతో ప్రొఫైల్ సృష్టించి, పెళ్లి కాని యువతులను మోసం చేశారు రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన చెరుకూరి హర్ష అలియాస్ జోగడ వంశీకృష్ణ అనే వ్యక్తి.
తన ప్రొఫైల్ చూసి అతన్ని సంప్రదించిన జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఒక వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐటీ శాఖ తన బ్యాంకు ఖాతాలను జప్తు చేసిందని చెప్పి రూ.11 లక్షలు తీసుకున్నాడు నిందితుడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో, పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.
ఇదే తరహాలో ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో తమను మోసం చేసినట్లు నిందితుడి మీద ఫిర్యాదు చేశారు పలువురు యువతులు. ఈ వ్యవహారంలో నిందితుడితో పాటు, షాదీ డాట్ కామ్ డైరెక్టర్ అనుపమ్ మిట్టల్, టీమ్ లీడర్ విఘ్నేష్, మేనేజర్ సతీష్‌ల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. తమ మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించగా, సుప్రీంకోర్టును ఆశ్రయించారు నిందితులు.
Also Read:న్యాయవాదిగా మారిన సీఎం మమతా
ఈ పిటిషన్ విచారిస్తూ షాదీ డాట్ కామ్ సైబర్ నేరగాళ్లకు మార్గాన్ని సులువుగా చేసిందని, అందుకే మీ మీద కేసు నమోదు చేశారని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఈ కేసు గురించి తెలంగాణ హైకోర్టు పునఃసమీక్షించుకుని, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని విచారణ ముగించింది సుప్రీంకోర్టు.

