హాంబర్గ్‌లో జరగనున్న జీ20 సమావేశాల వద్ద భారత ప్రధాని నరేంద్రమోదీని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలవడం జరగదని, అందుకు ప్రస్తుత పరిస్థితులు సహకరించడం లేదని చైనా తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల ఆర్మీల మధ్య సిక్కిం ప్రాంతంలో కొనసాగుతున్న వివాదమే ఇందుకు ప్రధాన కారణం. అయితే అందుకు విభిన్నంగా ఇరు దేశాల నేతలు నేడు ఎదురుపడ్డారు. జర్మనీలో హాంబర్గ్‌లో ప్రారంభమైన జీ20 సదస్సులో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పాల్గొన్నారు.
ప్రధాని మోదీ, చైనా దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. హాంబర్గ్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల నేతల సదస్సులో ఈ సీన్ కనిపించింది. ఎలిసిస్ హోటల్‌లో జరిగిన సమావేశానికి ఇద్దరూ హాజరయ్యారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇద్దరూ ఒకర్ని ఒకరు గ్రీట్స్ చేసుకున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రధాని మోడీ చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమైని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్నారు. అంతేగాక.. ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధిని మెచ్చుకున్నారు. మున్ముందు కూడా మరింత వృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చైనా దేశాధ్యక్షుడిపైన కూడా మోడీ కామెంట్ చేశారు. జీ జిన్‌పింగ్ నేతృత్వంలో బ్రిక్స్ దేశాలు పాజిటివ్‌గా ముందుకు వెళ్తున్నాయంటూ చైనా అధ్యక్షుడిని మోడీ మెచ్చుకున్నారు. అయితే సమావేశం అనంతరం ఇరుదేశాధినేతలు కరచాలనం చేసుకొని కాసేపు మాట్లాడుకున్నారు.
కాగా, హాంబర్గ్ వేదికగా రెండు రోజుల పాటు జరిగే జీ20 శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు మోడీ, జిన్‌పింగ్‌లతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని థెరిసా మే, జపాన్ ప్రధాని షింజో అబే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ తదితర ప్రపంచ నేతలు హాజరయ్యారు. వీరికి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సాదర స్వాగతం పలికారు.