2026లో జరగనున్న పుణె మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అజిత్ పవార్, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పుణె, పింప్రి–చించ్వడ్ నగరాల కోసం రెండు వర్గాలు కలిసి ఒక సంయుక్త మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఈ మేనిఫెస్టోను ఎన్‌సీపీ (ఎస్‌పీ) నేత సుప్రియా సూలే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కలిసి మీడియాకు వివరించారు.
ఈ సంయుక్త మేనిఫెస్టోలో స్వచ్ఛమైన తాగునీటి నిరంతర సరఫరా, వాయు కాలుష్యరహిత పుణె, ప్రధాన రహదారులను అంతర్గత నగర మార్గాలతో అనుసంధానం వంటి ముఖ్యమైన హామీలు ఇచ్చారు.ప్రస్తుతం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ అధికార మహాయుతిలో భాగంగా ఉండగా, శరద్ పవార్ వర్గం (ఎన్‌సీపీ-ఎస్‌పీ) ప్రతిపక్ష మహా వికాస్ ఆఘాడిలో ఉంది. జనవరి 15న జరగనున్న పుణె, పింప్రి–చించ్వడ్ మున్సిపల్ ఎన్నికల కోసం రెండు వర్గాలు కలిసి పోటీ చేయనున్నాయి.
ఇంతవరకు ప్రచారానికి దూరంగా ఉన్న సుప్రియా సూలే సహా ఎన్‌సీపీ (ఎస్‌పీ) నేతలు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ, మేనిఫెస్టోలో పుణె ప్రజల మౌలిక సమస్యలపై దృష్టి పెట్టామని తెలిపారు. ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, గుంతలు లేని రహదారులు, శుభ్రత, హైటెక్ ఆరోగ్య సేవలు, కాలుష్య నియంత్రణ, స్లమ్ పునరావాసం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.
అదనంగా PMPML బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం, 500 చదరపు అడుగుల వరకు ఇళ్లకు ప్రాపర్టీ ట్యాక్స్ మాఫీ, విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ టాబ్లెట్లు ఇవ్వాలని మేనిఫెస్టోలో ప్రతిపాదించారు. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, స్థానిక బీజేపీ నాయకత్వం పుణె, పింప్రి–చించ్వడ్ అభివృద్ధిని అడ్డుకుంటోందని అజిత్ పవార్ విమర్శించారు. 2017 నుంచి 2022 వరకు రెండు మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ పాలించిందని గుర్తు చేశారు.
Also Read:Sankranthi:పట్నం నుంచి జనం పల్లె బాట!
బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల కోసం బీజేపీ–శివసేన కూటమి మేనిఫెస్టోను జనవరి 11, ఆదివారం విడుదల చేయనుంది. ఈ సందర్భంగా జనవరి 12న శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప సీఎం ఏక్నాథ్ షిండే ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

