Sankranthi:పట్నం నుంచి జనం పల్లె బాట!

11
- Advertisement -

సంక్రాంతి పండుగ వేళ పట్టణాల నుంచి పల్లెల బాట పట్టిన జనం కారణంగా జాతీయ రహదారులపై తీవ్ర వాహన రద్దీ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారం ఎక్కువగా కనిపిస్తోంది. సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బయలుదేరడంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.

చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే తరహాలో కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద కూడా పరిస్థితి ఇదేలా ఉంది. కార్లు, బస్సులు, లారీలు అన్నీ కలిసిపోవడంతో టోల్ గేట్లను దాటేందుకు రెండు గంటలకుపైగా సమయం పడుతోంది.

టోల్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, వాహనాల సంఖ్య అధికంగా ఉండటంతో పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ చేయలేకపోతున్నారు. కొన్ని చోట్ల వన్ సైడ్‌గా వాహనాలను పంపిస్తూ పరిస్థితిని అదుపులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నారు.

దీంతో ప్రయాణికులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు చేయాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ట్రాఫిక్ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Also Read:మద్యం సీసాలపై కూటమి తప్పుడు ప్రచారం!

- Advertisement -