ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఎదురైన వైఫల్యాలే పాకిస్తాన్‌ను తొందరపడి రాజ్యాంగ సవరణలు చేయడానికి దారితీశాయని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. పుణే పబ్లిక్ పాలసీ ఫెస్టివల్‌లో మాట్లాడిన ఆయన, ఈ మార్పులు ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్‌కు అన్నీ సజావుగా జరగలేదన్న అంగీకారమేనని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్‌లో బయటపడిన లోపాలు సరిదిద్దుకునేందుకు పాకిస్తాన్ రాజ్యాంగంలో తొందరపడి చేసిన సవరణలు స్పష్టమైన సంకేతం. వారు ఎన్నో బలహీనతలను గుర్తించారు అని జనరల్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కి చేసిన సవరణతో దేశంలోని ఉన్నత రక్షణ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన వివరించారు. మూడు సాయుధ దళాల మధ్య సమన్వయం కోసం ఉద్దేశించిన ‘చైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ’ పదవిని రద్దు చేసి, దాని స్థానంలో ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF)’ అనే కొత్త పదవిని సృష్టించినట్లు తెలిపారు. అయితే ఈ పదవిని సృష్టించే అధికారం కేవలం ఆర్మీ చీఫ్‌కే ఉండడం, సంయుక్తత (జాయింట్‌నెస్) మౌలిక సూత్రాలకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే పాకిస్తాన్ నేషనల్ స్ట్రాటజీ కమాండ్, ఆర్మీ రాకెట్ ఫోర్సెస్ కమాండ్‌లను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇవి సంప్రదాయ, వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేయవచ్చని, కానీ అధికార కేంద్రీకరణకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. భూభాగ కేంద్రిత ఆలోచన విధానం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ మార్పులను ఆపరేషన్ సిందూర్‌తో పాటు యూరీ సర్జికల్ స్ట్రైక్స్, డోక్లాం–గాల్వాన్ ఘర్షణలు, బాలాకోట్ వైమానిక దాడి వంటి అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల ఫలితంగా చౌహాన్ వివరించారు. ఉన్నత రక్షణ వ్యవస్థకు సంబంధించి అనేక ఆపరేషనల్ పాఠాలను అమలు చేయాల్సి వచ్చింది అని తెలిపారు.
భారత్ కూడా అన్ని పరిస్థితుల్లో ఒకే విధమైన, అనువైన కమాండ్ వ్యవస్థను రూపొందించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. జాయింట్ థియేటర్ కమాండ్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మే 30, 2026 వరకు గడువు ఇచ్చిందని, అయితే దానికి ముందే ఈ వ్యవస్థను అమలు చేయాలని సాయుధ దళాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు.
Also Read:Sankranthi:పట్నం నుంచి జనం పల్లె బాట!

