తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూసీ నది ఆధారంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వేగంగా పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర పరిధి, మెరుగైన పౌర సేవల అందుబాటు లక్ష్యంగా ఈ విభజన చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త ప్రణాళిక ప్రకారం మొత్తం మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటవుతాయి. అవి — గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GSMC), గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GCMC). ప్రతి కార్పొరేషన్‌లో 100 వార్డులు ఉండేలా పునర్విభజన చేయనున్నారు. ఈ విధంగా మొత్తం మెట్రో ప్రాంతంలో 300 వార్డులు ఉండనున్నాయి.
ఈ మూడు కార్పొరేషన్లకు వేర్వేరుగా మేయర్లు ఉంటారు. దీంతో స్థానిక పరిపాలన మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నిర్మాణం ఉపయోగపడనుంది.
ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌లో 5 జోన్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి జోన్‌లో 4 సర్కిళ్లు ఉండేలా మొత్తం 20 సర్కిళ్లు ఉంటాయి. ఈ పరిపాలనా విభజన ద్వారా అధికారుల బాధ్యతలు స్పష్టంగా ఉండేలా చేసి, పనితీరును మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
Also read:మలేసియా బుక్ ఆఫ్ రికార్డులో ‘జన నాయగన్’
మూడు కార్పొరేషన్లకు కూడా సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించనున్నారు. తుది నోటిఫికేషన్‌ను జనవరిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆ తరువాత ఏప్రిల్–మే నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మార్పులు హైదరాబాద్ నగర పరిపాలనలో కీలక మలుపుగా నిలవనున్నాయి.

