రికార్డు సృష్టించిన ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని నమోదు చేసింది. తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 27న మలేసియాలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 85 వేల మందికి పైగా అభిమానులు, సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనడంతో ఇది మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
విజయ్ హీరోగా నటిస్తున్న చివరి చిత్రంగా ‘జన నాయగన్’ను ప్రకటించడంతో ఈ ఆడియో లాంచ్‌కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. అభిమానుల ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రబృందం మలేసియాలో ఈ భారీ ఈవెంట్‌ను నిర్వహించగా, వేదిక చుట్టూ వేలాదిమంది అభిమానులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది.
ఆడియో లాంచ్ సందర్భంగా విజయ్ స్టేజ్‌పై అభిమానులతో హృదయపూర్వకంగా మాట్లాడారు. అంతేకాదు ‘దళపతి కచేరి’ పాటకు డ్యాన్స్ చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. ఆయన ఎనర్జీ, స్టేజ్ ప్రెజెన్స్ మరోసారి దళపతి ఫ్యాన్స్‌ను మంత్ర ముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే చీరలో మెరిసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కోలీవుడ్‌లోనే కాక దేశవ్యాప్తంగా దళపతి విజయ్‌కు ఉన్న అపారమైన అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే TVK (తమిళగ వేట్రి కళగం) పేరుతో తన రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్, పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకోవడంతో ఈ చిత్రం ఆయన సినీ కెరీర్‌కు చివరి సినిమాగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ విజయ్ అభిమానులకు భావోద్వేగంతో పాటు గర్వకారణంగా మారింది.
Also Read:తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ

