దేశ రాజధాని ఢిల్లీని ఘనమైన పొగ మంచు కమ్మేసింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న తీవ్ర పొగ మంచు కారణంగా సాధారణ జీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. తక్కువ విజిబిలిటీ కారణంగా అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, కొన్ని విమానాలను దారి మళ్లించే పరిస్థితి ఏర్పడింది.
ఈ పొగ మంచు ప్రభావంతో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరాల్సిన విమానం కూడా ఆలస్యమైంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజిబిలిటీ భారీగా తగ్గడంతో భద్రతా కారణాల దృష్ట్యా విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.
పొగ మంచు పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమానాల స్టేటస్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించింది. అలాగే విమానాలు ఆలస్యం అయ్యే అవకాశమున్నందున ముందస్తుగా సమయం కేటాయించుకుని ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని తెలిపింది.

Also Read:నిర్మాణ రంగంలోకి వెంకీ కుడుముల
మరోవైపు వాతావరణ శాఖ కూడా రానున్న రోజుల్లో పొగ మంచు తీవ్రత కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పొగ మంచు ప్రభావం ఇంకా కొనసాగే సూచనలు ఉండటంతో ఢిల్లీలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.

