ఆకతాయిల ఆగడాల నుంచి, వేధింపుల బారి నుంచి అమ్మాయిలను కాపాడేందుకు మధ్య ప్రదేశ్ పోలీసులు కొత్తగా ఆలోచించారు. ఈ ఆలోచనతో ఆకతాయిల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. అదేలాగంటారా.. సెల్ఫీతో.
ప్రస్తుతం సెల్ఫీ ట్రెండ్ నడుస్తుండగా.. ఎంపీ పోలీసులు ఆ సెల్ఫీలను ఆయుధంగా మలుచుకోండని అక్కడి అమ్మాయిలను ప్రోత్సాహిస్తున్నారు. రాష్ట్రంలోని హూషంగాబాద్ లో ‘సెల్ఫీ విత్ కాప్స్’ అనే ఆలోచనతో ప్రచారం ప్రారంభించారు. వందలాది మంది అమ్మాయిలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి అక్కడివారితో సెల్ఫీలు దిగుతున్నారు. హూషంగాబాద్ ఎస్పీ ఏపీ సింగ్ కు వచ్చిన ఆలోచనను స్వాగతించిన డీజీపీ రిషికుమార్ శుక్లా మిగతా అన్ని జిల్లాల్లోనూ ‘సెల్ఫీ విత్ కాప్స్’ ప్రారంభించాలని ఆదేశించగా, ఇప్పటికే 12 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలోని వందలాది పోలీస్ స్టేషన్ల ముందు సెల్ఫీలు దిగేందుకు వస్తున్న అమ్మాయిలు క్యూ కడుతున్నారు. ఫోటోలు తీసుకున్న అమ్మాయిలు తమకు వేధింపులు తగ్గాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
‘సెల్ఫీ విత్ కాప్స్’ పేరిట పోలీసులు, అమ్మాయిలతో ఫోటోలు దిగేందుకు సిద్ధంగా ఉండగా, వారితో సెల్ఫీలు దిగి తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ, ప్రొఫైల్ పిక్చర్లుగా పెడుతూ, ‘అతను నా అన్నయ్య’ అని ట్యాగ్ లైన్లు పెడుతున్నారు. సెల్ ఫోన్లలో సైతం స్క్రీన్ మీద ఈ ఫోటోనే కనిపించేలా చూసుకుంటున్నారు. ఈ ఒక్క సెల్ఫీ అమ్మాయిల వెంటపడే ఆకతాయిలను అడ్డుకుంటుందని అమ్మాయిలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హోషంగబాద్ పోలీసులకు అమ్మాయిల వేధింపులకు సంబంధించి ప్రతిరోజు వందల సంఖ్యలో వాట్సప్ మెస్సేజ్‌లు వస్తున్నాయి. ఒక కేసులో ఒ అకతాయి.. ఒక అమ్మాయి ఫోటోను.. ఆమె ఫోన్ నంబర్‌ను పోర్న్ సైట్లో అప్ లోడ్ చేశాడు. అయితే పోలీసులు సెల్ఫీలే కాకుండా తమ ఫోన్ నంబర్లను కూడా అమ్మాయిలకు ఇస్తున్నారు. పోలీసులతో సెల్ఫీ దిగిన తరువాత కూడా వెనక్కు తగ్గని ఆకతాయిలు ఎదురైతే, వారికి బుద్ధి చెప్పేందుకు తామెలానూ ఉంటామన్న భరోసాను పోలీసులు కల్పిస్తున్నారు.