వరంగల్ జిల్లా విద్యార్ధులకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ ఫెయిర్‌ని నిర్వహిస్తున్నందకు టీన్యూస్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. టీన్యూస్ – అపెక్స్ ఆధ్వర్యంలో హన్మకొండ నక్కలగుట్టలోని నందన గార్డెన్‌లో నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వాళన చేసి ప్రారంభించిన ఆయన ఎడ్యుకేషన్ ఫెయిర్ విద్యార్ధులకు చక్కటి వేదిక అన్నారు.
తాము ఎంచుకునే కాలేజీల వివరాలను తెలసుకునేందుకు విద్యార్ధులకు ఉపయోగపడుతుందన్నారు. ఏ కోర్సు చేసిన ఆసబ్జెక్ట్‌పై పరిపూర్ణ అవగాహన ఉంటేనే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తెలిపారు. పిల్లల నైపుణ్యాన్ని బట్టి వారి ఇష్టాన్ని బట్టి వారికి కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశం తల్లిదండ్రులు ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు తొందరపడి విద్యార్థుల మీద భారం వేయోద్దని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంజనీరింగ్ విద్యను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ అభిమతమని స్పష్టం చేశారు. కనీస వసతులు లేని కాలేజీలపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. బోగస్ కాలేజీలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
దేశంలో ఎక్కడ ఏ పోటీ పరీక్ష జరిగినా తెలంగాణ విద్యార్ధులు పోటీ పడే విధంగా విద్యావ్యవస్థను తీసుకొస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు 510 గురుకుల పాఠశాలలు తీసుకొస్తున్నామని చెప్పారు. సంగారెడ్డి సభలో రాహుల్ అవాస్తవాలు మాట్లాడారని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏనాడైన గురుకుల పాఠశాలు తీసుకురావాలన్న ఆలోచన చేసిందా అని ప్రశ్నించారు. పేద విద్యార్థుల విదేశీ చదువుకోసం రూ. 20 లక్షల ఆర్ధిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయాలకు మహర్ధశ పట్టిందన్నారు.
ప్రతిపక్షాలు విమర్శలు చేసేముందు తాము ఏం చేశామో ఆలోచించుకోవాలన్నారు. విద్యార్ధులకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్న టీ న్యూస్‌కు మరోసారి అభినందనలు తెలియచేస్తున్నానని కడియం తెలిపారు. ఎడ్యుకేషన్ ఫెయిర్‌తో పాటు నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో టీ న్యూస్ పాత్ర మరువలేనిదని మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. నేడు బంగారు తెలంగాణ సాధనలో నిర్విరామ కృషి చేస్తుందన్నారు. తెలంగాణ గొంతుక వినిపించడంలో టీ న్యూస్ కృషి అభినందనీయమన్నారు. విద్యార్ధుల కెరీర్ గైడెన్స్ కోసం ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తోందని వివిధ ప్రాంతాల విద్యార్ధులకు ఆయా కాలేజీల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్‌ని అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వ చిఫ్‌విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి,ఎంపీ పసునూరి దయాకర్,మేయర్ నన్నపునేని నరేందర్, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి,కూడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీన్యూస్ సీఈవో నారాయణరెడ్డి, సీజీఎం ఉపేందర్‌తో పాటు వివిధ కాలేజీల ప్రతినిధులు హాజరయ్యారు.
గత మూడు సంవత్సరాలుగా టీ న్యూస్ నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో వేల సంఖ్యలో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. వివిధ కాలేజీల సమాచారాన్ని తెలుసుకున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత విద్యార్ధులతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందించేందుకు బాగా ఉపయోగపడింది.
కాగా కార్యక్రమ నిర్వహణకు ప్లాటీనం స్పాన్సర్స్ మర్రి లక్ష్మణ్ గ్రూప్ ఇనిస్టిట్యూట్, డైమండ్ స్పాన్సర్స్ ఎస్‌వీఎస్ విద్యాసంస్థలు, గోల్డెన్‌స్పాన్సర్స్ శ్రేయ ఇంజినీరింగ్ కాలేజీలు ముందుకొచ్చాయి. ఈ ఫెయిర్‌లో రాష్ట్రంతో పాటుగా దేశ వ్యాప్తంగా 40 పేరుగాంచిన విద్యాసంస్థలు పాల్గొననున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ కు ప్రవేశం ఉచితం. ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్‌లో ప్రధానంగా ఇంజనీరింగ్, మెడిసిన్‌తో పాటు ఇతర అన్ని కోర్సులు, కెరీర్స్ పై విద్యార్థులకు అవగాహన కల్ప. ఆయా రంగాలకు చెందిన అత్యంత నిష్ణాతులు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందిస్తారు. అంతేగాదు లక్కీ డ్రా ద్వారా విద్యార్ధులకు బహుమతులు కూడా అందించనున్నారు.
విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీ, బ్రాంచ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ బ్రాంచ్‌లతో కెరీర్ స్కోప్, ఉన్నత విద్యావకాశాలు, పరిశ్రమలు కోరుకుంటున్న నైపుణ్యాల గురించి విద్యారంగ నిపుణులు అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి సలహాలు సూచనలు ఇస్తారు. కాబట్టి రెండు రోజుల పాటు జరిగే ఎడ్యుకేషనల్ ఫెయిర్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సహా పెద్ద సంఖ్యలో హాజరై తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరుకుంటోంది greattelangaana.com