నయీంతో తనకు సంబంధాలు లేవని బీసీ సంఘం నేత,ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. నయీంతో ఉన్న సంబంధాలపై వార్తలు వస్తున్న నేపథ్యంలో వివరణ ఇచ్చిన కష్ణయ్య…నయీమ్ తో ఆర్థిక వ్యవహారాల్లో తనకు లింకులుంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని తెలిపారు. రాడికల్ ఉద్యమ సమయంలో నయీమ్ తనతో కలిసి పనిచేశాడని, తనను సీఎంగా చూడాలన్నది నయీమ్ కలని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తన పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తరవాత, నయీమ్ సంతోషించాడని… తన గెలుపు, ప్రచారం వెనుక ఆయన హస్తం లేదని చెప్పారు. 1986 నుంచి నయీమ్ తనకు తెలుసునని…. పట్లోళ్ల గోవర్థన్ రెడ్డి సైతం తనకు మంచి మిత్రుడని తెలిపారు.
తనను పోలీసులు టార్గెట్ చేశారని తెలుసుకున్న నయీమ్, మరో ముగ్గురితో కలసి లొంగిపోవాలని చూశాడన్నారు. నయీమ్ తో తనకు ఉన్న సంబంధాలు ఆర్థికపరమైనవి కాదని, బెదిరింపులకు, కబ్జాలకు చెందినవి అంతకన్నా కాదని అన్నారు. పలువురు నయీమ్ బాధితులు తనతో మాట్లాడిన సమయంలో, తాను నయీమ్ కు ఫోన్ చేసి పేదల జోలికి వెళ్లొద్దని హెచ్చరించినట్టు కృష్ణయ్య తెలిపారు. భువనగిరిలో జరిగిన ఉర్సు, వినాయక ఉత్సవాలకు నయీమ్ ఆహ్వానం మేరకు వెళ్లి రెండుసార్లు పాల్గొన్నానని గుర్తు చేశారు.
నయీమ్ రాసుకున్న డైరీని బయటపెట్టాలని డిమాండ్ చేసిన ఆయన, ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు.ఈ కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం తనకు నోటీసులు ఇస్తే వారి విచారణకు హాజరవుతానని తెలిపారు.