BJP: వాళ్ళు.. గెలిచి నిలుస్తారా?

23
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు జాబితాలో అభ్యర్థులను కూడా ఫైనల్ చేసింది. వరంగల్, ఖమ్మం మినహా మిగిలిన 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనన్ని సీట్లు గెలిచేలా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక తాజాగా ప్రకటించిన రెండో జాబితాతో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి వంటి వారు ఎన్నికల బరిలో ఉన్నట్లు తేలిపోయింది. ఈటెల రాజేందర్ మల్కాజ్ గిరి, కిషన్ రెడ్డి సికింద్రాబాద్, బండి సంజయ్ కరీంనగర్, ధర్మపురి అరవింద్ నిజామాబాద్.. వంటి స్థానాల్లో పోటీ చేయనున్నారు. అయితే ఈ నలుగురికి లోక్ సభ ఎన్నికలు ఎంతో కీలకం.

ఎందుకంటే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచిన వీరు ఘోర ఓటమిని చవిచూశారు. దాంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురయ్యే ఫలితాలు వీరి రాజకీయ భవిష్యత్ ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే వారు ఎంపీలుగా పని చేసిన ప్రాంతాలలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టలేదనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. ముఖ్యంగా కరీంనగర్ లో బండి సంజయ్ అసలు ఉన్న లేనట్లుగానే వ్యవహరించారని కేంద్రం నుంచి నిధులను తేవడంలో బండి సంజయ్ తీవ్ర నిర్లక్ష్యం వహించారని విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి.

ఇక ఈటెల విషయానికొస్తే బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అతని రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగానే మారింది, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఆయన రెండు చోట్ల కూడా ఓటమి చవిచూశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే.. ఆయన పార్టీ మారడం లేదా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఈ పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ బీజేపీలోని కొంతమంది నేతలకు అత్యంత కీలకంగా మారాయి. మరి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

Also Read:లేట్ ప్రెగ్నెన్సీ లాభామా ? నష్టమా ?

- Advertisement -