బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు నేషనల్ హీరో అయిపోయాడు. దీంతో తన తర్వాతి సినిమాలపై దృష్టిసారించిన ఈ రెబల్ స్టార్ బాలీవుడ్‌లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సాహో సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పనిచేయనుండగా బాలీవుడ్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతాన్ని అందించనున్నారు. ఇక ‘ఘాజి’ ఫేమ్ మది సినిమాటోగ్రఫీ అందించనున్నారు.
బాహుబలి చిత్రానికి గాను హిందీ, తమిళంలో ప్రభాస్ పాత్రకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు. అయితే ‘సాహో’కి మాత్రం అలా జరగడానికి వీలు లేకుండా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. అంతేగాదు బాలీవుడ్‌లో పాతుకుపోవాలనే కసితో హిందీ భాష మీద పట్టు సాధించే పనిలో పడ్డాడు.
ఎందుకంటే హీరో పాత్రకు ఎంతగా గుర్తింపు వచ్చినా.. డబ్బింగ్ వాయిస్‌తో వారికి పూర్తిస్థాయిలో చేరువ కాలేడు. అందుకే ఆ లోటుని కూడా భర్తీ చేసి సాహోతో జాతీయ నటుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఏ స్ట్రాటజీలతో అయితే బాహుబలి సినిమాను బాలీవుడ్ లో మార్కెట్ చేశారో.. అదే విధంగా సాహో సినిమాను కూడా మార్కెట్ చేయాలనుకుంటున్నారు.