లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నెలలోనే ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. కాగా గత లోక్ సభ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి మరిన్ని సీట్ల పై కన్నెసింది. పైగా ప్రస్తుతం అధికారంలో ఉండడంతో లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయంగా భావిస్తోంది. అయితే అభ్యర్థుల ఎంపిక హస్తం పార్టీ తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నల్గొండ, మెదక్ స్థానాల్లో పోటాపోటిగా అభ్యర్థులు రేస్ లో ఉండడంతో ఎవరికి సీట్లు కేటాయించాలనే కన్ఫ్యూజన్ పార్టీ వర్గాల్లో నెలకొన్నట్లు తెలుస్తోంది. మెదక్ లోక్ సభ స్థానం కోసం పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి, గజ్వేల్ మండలానికి చెందిన బండారి శ్రీకాంత్ రావు, మద్దుల సోమేశ్వరరెడ్డి, మైనంపల్లి హనుమంతరావు వంటి వారు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది..
ఇక నల్గొండ బరిలో కోమటిరెడ్డి కూతురు శ్రీనిధి, జానారెడ్డి కుమారుడు రఘువీర్, పటేల్ రమేష్ రెడ్డి వంటి వారు రేస్ లో ఉన్నారు. దాంతో అటు మెదక్, ఇటు నల్గొండ రెండు స్థానాల్లో పోటీ గట్టిగానే ఉండడంతో వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనేది తలపోటుగా మారే అంశమే. అయితే ప్రస్తుతం రేసు లో ఉన్నవారంతా కూడా పార్టీకి కీలక నాయకులు, వారి కుటుంబీకులు కావడంతో ఒకరిని ఎంపిక చేస్తే మరొకరి నుంచి అసంతృప్త నినాదాలు వినిపించే అవకాశం లేకపోలేదు. అందుకే లోక్ సభ స్థానాల ఎంపికలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే పాటించాలని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ సూచించిన వారికే సీట్ల కేటాయింపు జరిపేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
Also Read:INDvsENG :ఇంగ్లాండ్ చరిత్ర తిరగరాస్తుందా?