తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో దిగిన జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీకి ప్రతి చోట కూడా గట్టి ఎదురుదెబ్బే తగిలింది. కూకట్ పల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేట.. ఇలా పోటీ చేసిన ప్రతి చోట కూడా జనసేన పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. మొదట తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవన్ కల్యాణ్ తెలంగాణలో 32 చోట్ల పోటీ చేయాలని భావించారు. .
కానీ ఆల్రెడీ ఎన్డీయే కూటమిలో ఉన్న కారణంగా చివరి నిముషంలో బీజేపీతో చేతులు కలిపి కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం అయ్యారు. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ ఆశించిన స్థాయిలో చురుకుగా పాల్గొనలేదు. నామమాత్రంగానే ప్రచారాలను నిర్వహించారు. ఫలితంగా తెలంగాణలో జనసేన పార్టీకి గట్టి పరాభవం ఎదురైంది. అయితే తెలంగాణలో ప్రధానంగా బిఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మద్యనే పోటీ ఉన్నప్పటికి.. బీజేపీ కూడా ప్రభావం చూపుతుందని, బీజేపీకి తోడు జనసేన కలవడంతో రెండు పార్టీలు మెరుగైన ఫలితాలు సాధిస్తాయని అంచనా వేశారు ఆ పార్టీల నేతలు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా జనసేన ఒక్క స్థానం లో కూడా సత్తా చాటలేక చేతులెత్తేసింది. దీంతో జనసేన పార్టీకి తెలంగాణలో ఎదురైన పరాభవం ఏపీలో కూడా ఎఫెక్ట్ చూపుతుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read:KTR:కాంగ్రెస్‌కు గుడ్ లక్