ప్లేఆఫ్‌లోకి పుణే

163
Pune rout Kings XI for 73 to book second place
Pune rout Kings XI for 73 to book second place
- Advertisement -

ఐపీఎల్‌ 10లో బాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పుణె, పంజాబ్‌ పోరు ఏకపక్షంగా జరిగింది. పంజాబ్‌ను చిత్తు చేసిన పుణె ప్లేఆఫ్స్‌లోకి ఎంటరైంది. ముందుగా పంజాబ్ 15.5 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ (20 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్. తర్వాత పుణె 12 ఓవర్లలో వికెట్ నష్టపోయి 78 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. రహానే (34 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (20 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించి శుభారంభానివ్వగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ (18 బంతుల్లో 15 నాటౌట్) జట్టుకు విజయాన్నిఅందించాడు. ఉనాద్కత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

టాస్ ఓడిన పంజాబ్ ఈ సీజన్‌లోనే చెత్త బ్యాటింగ్ ప్రదర్శనను చూపెట్టింది. ఇన్నింగ్స్ తొలి బంతికే గప్టిల్ (0) ఔట్‌కాగా, సాహా (13)తో కలిసి షాన్ మార్ష్ (10) ఆటను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. కొద్దిసేపటికే ఉనాద్కత్ వేసిన డైరెక్ట్ త్రోకు మోర్గాన్ (4) రనౌటయ్యాడు. ఇక ఐదో ఓవర్‌లో ఠాకూర్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని ఎదుర్కొలేక రాహుల్ టెవాటియా (4) షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉనాద్కత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ 32 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటి వరకు సహచరుల నిష్క్రమణను చూస్తూ గడిపిన సాహా, అక్షర్‌తో కలిసి ఆదుకునే ప్రయత్నం చేసినా పుణె బౌలర్ల ఒత్తిడికి తలొగ్గాడు. పదో ఓవర్ రెండో బంతికి సాహా ఇచ్చిన క్యాచ్ ధోనీ డైవ్ చేస్తూ అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. స్పిన్నర్ జంపా టెయిలెండర్ల భరతం పట్టడంతో మరో 5 ఓవర్లలోనే పంజాబ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. శార్దూల్ ఠాకూర్ 3, జంపా, క్రిస్టియన్, ఉనాద్కత్ తలా రెండు వికెట్లు తీశారు.

ఐపీఎల్‌లో సోమవారం విరామం. మంగళవారం ప్లేఆఫ్స్‌కు తెరలేవనుంది! ముంబయిలో జరిగే తొలి క్వాలిఫయర్‌లో ముంబయి, పుణెను ఢీకొననుంది.

- Advertisement -