ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు సీఎం కేసీఆర్. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో బీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం…ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు. ఆలోచించి ఓటు వేస్తే వచ్చే 5 సంవత్సరాలు అభివృద్ధిలో దూసుకుపోతాం అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 50 ఏళ్లు పాలించి ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. 50 సంవత్సరాలు హరిగోస పడ్డాం, ఆకలి చావులు, వలసలు,కరెంట్ కోతలు, రైతుల ఆత్మహత్యలు అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 10 సంవత్సరాల్లో ఏం చేశామో మీ కళ్ల ముందే ఉందన్నారు. పేదల సంక్షేమానికే పెద్దపీట వేశామన్నారు. కాంగ్రెస్ పెన్షన్ రూ.200 ఇస్తే తాము రూ.2 వేలు ఇస్తున్నామని ఈసారి మళ్లీ అధికారంలోకి రాగానే రూ.5 వేల పెన్షన్ ఇస్తామన్నారు.
సంక్షేమం చూశాం..ఒక్కొ సమస్యను పరిష్కరించుకుంటూ దేశంలోనే తెలంగాణను అగ్రభాగంలో నిలిపామన్నారు. రైతు బంధు అనే పథకాన్ని పుట్టించేందే కేసీఆర్ అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొంటున్నామని చెప్పారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని..రైతుబంధు ఉండాలంటే పట్నం నరేందర్ రెడ్డి గెలవాలన్నారు. 24 గంటల కరెంట్ అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారని..పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంట్ ఇస్తారన్నారు. 24 గంటల కరెంట్ ఉండాలంటే నరేందర్ రెడ్డి గెలిచి తీరాలన్నారు.
రేవంత్ రెడ్డి భూకబ్జా దారు అని మండిపడ్డారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేసి భూమాతా తీసుకువస్తారట..అది భూమాత కాదు భూమేత అన్నారు. ధరణిని తీసేస్తె మళ్లి దళారుల రాజ్యం వస్తుందన్నారు. నరేందర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని గమనించాలన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ని పట్టించుకోలేదని, ఉత్త మాటలు తప్ప చేసిందేమి లేదన్నారు. పనిచేసే నరేందర్ రెడ్డి కావాలా…ఫాల్త్ మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి కావాలో ఆలోచించాలన్నారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ టికెట్లను రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిప్ప కూడు తిన్నా సిగ్గురాలేదని…అది పతకం అని మాట్లాడుతున్నారని సిగ్గుండాలన్నారు. ఉస్మానియా విద్యార్థులు తాగుబోతులని మాట్లాడుతారని,జర్నలిస్టులను పండబెట్టి తొక్కుతా అని మాట్లాడే రేవంత్ రెడ్డికి ఓటుతో బుద్దిచెప్పాలన్నారు. కొడంగల్ గౌరవం పెరగాలంటే నరేందర్ రెడ్డి గెలవాలన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు అదంతా గ్యాస్ అని… నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ఆయన స్థాయి పెరుగుతుందన్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారని…కొడంగల్లో సైతం అడ్రస్ గల్లంతు చేయాలన్నారు.
Also Read:KCR:రోహిత్ రెడ్డితోనే తాండూరు అభివృద్ధి