ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తె అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె.అన్ని రకాల ఆధిపత్యాలపై, అన్యాయాలపై తిరుగుబాటు చేసిన ధిక్కార స్వరం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పలుకులివి. పద్మవిభూషణ్ బిరుదు కన్నా ప్రజాకవి అన్న బిరుదే గొప్పదని ప్రకటించిన కాళోజీ ప్రజల భాషనే అనుసరించాలన్నారు. కాళోజీ అంటే ధిక్కారం. ఆయన అన్యాయాన్ని సహించలేడు. పెత్తందారీ, అప్రజాస్వామ్యంపై తన అక్షరాల కొరడాను ఝళిపించిన యోధుడు..తెలంగాణ పల్లె పైరుగాలి నుంచి వీచిన భాషనే సాహిత్య భాషగా మార్చిన కవి… పదవులు, హోదాలకు అదరక, బెదరక ప్రశ్నించే ప్రజల పక్షపాతి! ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పరితపించిన హక్కుల నేత… సామాన్యుల గొడవనే తన గొడవగా ఎలుగెత్తిన ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతి నేడు. ప్రభుత్వమే అధికారికంగా కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది.
భాష పట్ల వివక్షను కాళోజీ ఏ రోజూ సహించలేదు. పరభాషా వ్యామోహం తగదని హెచ్చరించాడు. విశాలాంధ్ర ఉద్యమాన్ని సమర్థించిన కాళోజీ తరువాత కోస్తాంధ్ర ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. వానాకాలంలోనూ చేనులెండిపోతాయని/ మండే వేసవిలో వలె ఎండలు కాస్తుంటాయని ఎవరనుకున్నారు?/ అట్లవునని ఎవరనుకున్నారు? అంటూ తెలంగాణ గొంతుక వినిపించాడు. ఆయన నా గొడవ నిత్యం మండిస్తూనే ఉంటుంది. వరంగల్ ఆయన నివాసమైనప్పటికీ హైదరాబాద్ నగరంతోనూ ఆయనకు విడదీయరాని బంధముంది. భాషా, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన విశేష కృషి ఇక్కడినుంచే మొదలయింది.
Also Read:’35-చిన్న కథ కాదు’ ..అద్భుత రెస్పాన్స్
కాళోజీ తెలంగాణ భాషపై కోస్తాంధ్ర భాష ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. తెలంగాణ పలుకుబడులకు ప్రాధాన్యమిచ్చాడు. ఆత్మకథను తెలంగాణ యాసలోనే రాశాడు. తనది బడిపలుకుల భాష కాదు. పలుకుబడుల భాష. ఏ ఇద్దరి దస్తూరీ ఒక్కరకంగా వుండనట్లుగా.. ఏ ఇద్దరి ఉచ్ఛరనా ఒక్కరకంగా వుండదు.ఇలా 20వ శతాబ్దపు తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చరిత్రలో కాళోజీ ఒక అద్భుత అధ్యాయం.
Also Read:మట్టి గణనాథులే ముద్దు…