ఫ్రీ బేసిక్స్ నిర్ణయం నుంచి వెనకడుగు వేసిన తర్వాత..ఫేస్ బుక్ మరోసారి భారత్ లో ఇంటర్నెట్ సర్వీసులపై దృష్టి పెట్టింది. ఇప్పడు ‘ఎక్స్‌ప్రెస్ వైఫై’ సర్వీసులు అందివ్వడానికి రెడీ అయ్యింది. దీనిలో భాగంగా పబ్లిక్ హాట్‌స్పాట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించనుంది. దీనికోసం టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం కింద ఎయిర్‌టెల్ రానున్న కొద్ది నెలల్లో 20 వేలకు పైగా వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేస్తుంది. దీని అమలుకు కావలసిన వేదికను, సొల్యూషన్లను మాత్రమే తాము అందిస్తామని ఫేస్‌బుక్ కనెక్టివిటీ సొల్యూషన్స్ ఆసియా, పసిఫిక్ హెడ్ మునీష్ శేఠ్ చెప్పారు. దీని కోసం టెలికాం ఆపరేటర్ నుంచి తాము ఎలాంటి రుసుము వసూలు చేయబోమని, సర్వీసుకు ఎంత చార్జి వసూలు చేయాలన్నది సంబంధిత ఆపరేటర్ నిర్ణయించుకుంటారని ఆయన తెలిపారు.
ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్, మేఘాలయల్లో ఇప్పటికే 700 హాట్‌స్పాట్‌లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. నెట్ న్యూట్రాలిటి కారణంగా తీవ్ర విమర్శల పాలైన ఫేస్ బుక్ సంస్థ.. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ వైఫై సేవలు ఆవిష్కరించింది.
ఏవో కొన్ని వెబ్‌సైట్లకే ఇది పరిమితం కాదు. భాగస్వామ్య టెలికాం ఆపరేటర్ల వైఫై హాట్‌స్పాట్‌ల నుంచి లాగ్ ఆన్ కావలసి ఉంటుంది. ఇందు కోసం రోజువారీ, వారం, నెలవారీ డేటా ప్యాక్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.