దేశ రాజకీయాల్లోకి బిఆర్‌ఎస్ ఎంట్రీ ఇచ్చిన తరువాత బిఆర్‌ఎస్ ప్రభావం ఆయా రాష్ట్రాలలో గట్టిగానే పడింది. జాతీయ పార్టీగా ప్రకటించిన కొద్ది కాలంలోని అందరి దృష్టిని ఆకర్షించడం బహుశా బిఆర్‌ఎస్ మాత్రమే చెల్లిందనే చెప్పాలి. కర్నాటక, ఏపీ, మహారాష్ట్ర, బిహార్ వంటి రాష్ట్రాలలో పార్టీ విస్తరిస్తున్న తీరు అక్కడి స్థానిక పార్టీలను సైతం కలవరపరుస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ విస్తరించిన తీరు బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలను సైతం డైలమాలో పడసింది. శివసేన, ఎన్సీపీ, బీజేపీ వంటి బలమైన పార్టీల ప్రభావం గట్టిగానే ఉన్నప్పటికి అక్కడి ప్రజలు కేసిఆర్ నాయకత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు..
దీంతో ఇతర పార్టీల నేతలు సైతం బిఆర్‌ఎస్ వైపు చూస్తూ గులాబీ కండువా కప్పుకుంటున్నారు. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి సిఎం కేసిఆర్ సైతం ఆ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గట్టిగానే కృషి చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో వరుస పర్యటనలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలు మరింత చేరువ అవుతున్నారు కేసిఆర్. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ తొలి విజయాన్ని నమోదు చేసింది. మహారాష్ట్రలోని లోహల్ గ్రామంలో జరిగిన పంచాయతీ ఉప ఎనికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి గఫూర్ పఠాన్ 115 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో ఆ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ తొలి విజయాన్ని నమోదు చేసింది.
అయితే ఇది పంచాయతి ఉపఎన్నికనే అయినప్పటికి రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ ప్రభావం ఆ రాష్ట్రంలో గట్టిగా ఉండబోతుందనే దానికి సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. నూతన పార్టీ గ్రామ స్థాయిలో బలపడడం సాధ్యమయ్యే పని కాదు. కానీ బిఆర్‌ఎస్ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ కు సంబంధించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. మొత్తానికి తాజా పరిణామాలు చూస్తుంటే మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ శకం మొదలైనట్లే కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ మహారాష్ట్రలో ఎలాంటి సంచలనలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read: CMKCR:దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ చేసింది శూన్యం