అలనాటి అందాల నటుడు శోభన్ బాబు తెలుగు తెర పై క్రమశిక్షణ అనే పదానికి ప్రతీకగా నిలిచారు. తెరమీద శోభన్ బాబు చంద్రబింబంలా కనిపించేవారు, దానికి కారణం శోభన్ బాబు రూపురేఖలే అయినప్పటికీ.. వాటి వెనుక ఆయన భార్య “కుమారి” గారి కష్టం కూడా దాగి ఉంది. శోభన్ బాబు గారి అందం, ఆరోగ్యం విషయంలో ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. అందుకే, శోభన్ బాబు గారికి “కుమారి” గారు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. వీరి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి మీ కోసం ఓ ఉదాహరణ.
అవి ”అందరూ దొంగలే” అనే చిత్రం షూటింగ్ జరుగుతున్న రోజులు. కథకు అనుగుణంగా శోభన్ బాబు గారికి కాంటాక్ట్ లెన్స్ పెట్టాల్సి వచ్చింది. పైగా భోజనం లేకుండా, నిద్రలేకుండా – పాత్ర మీద ఏకాగ్రతతో రాత్రీ పగలూ షూటింగ్ లో శోభన్ బాబు పాల్గొన్నారు. దాంతో కాంటాక్ట్ లెన్స్ బ్యాలెన్స్ తప్పాయి. దేనికీ పెద్దగా చలించని శోభన్ బాబు గారిలో కూడా ఆ రోజు టెన్షన్ మొదలైంది. డాక్టర్లు పరీక్షించి పూర్తి విశ్రాంతి అవసరం అన్నారు. కదలకూడదని చెప్పారు, నేరుగా శోభన్ బాబు ఇంటికి వచ్చారు. ఎవరితో మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని పడుకున్నారు.
Also Read: Nani:’మేమ్ ఫేమస్’ బాక్సాఫీస్ బెండ్ తీస్తుంది
ఉదయం అయింది. శోభన్ బాబు లేవలేదు. రాత్రి అయ్యింది, ఇంకా లేవలేదు. చూస్తుండగానే రోజు అంతా గడిచిపోయింది. శోభన్ బాబు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసుకున్నారు, మిణుకు మిణుకుమంటూ చిన్న వెలుతురు కనిపించింది. శోభన్ బాబు నెమ్మదిగా పైకి లేచి మూసివున్న తలుపు తెరిచారు. గుమ్మం దగ్గర అచేతనంగా కుమారి గారు కూలబడి ఉన్నారు. అంతలో ఎదురుగా శోభన్ బాబు గారిని చూసిన కుమారి గారు కళ్ళు తుడుచుకుని గబగబా వెళ్లి ఆయనకు ప్లేట్ లో భోజనం పట్టుకొచ్చారు. ఆమె కళ్ళల్లో బాధ చూసిన శోభన్ బాబు చలించిపోయారు. కుమారి గారు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా తన కోసం ఏడుస్తూ ఉండటం శోభన్ బాబు హృదయాన్ని కదిలించింది. ఇదే విషయాన్ని ఆయన ఎప్పుడు చెబుతూ ఉండేవారు.
Also Read: ఫుల్ కిక్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్