సినిమాలు రిలీజ్ అవడమే ఆలస్యం..రివ్యూల వర్షం పడుతూనే ఉంటుంది. నిజానికి చాలా మంది రివ్యూలు చూసే..సినిమాలు చూడాలని డిసైడైపోతున్నారు. ఇక రివ్యూలు నెగిటివ్ గా ఉంటే మాత్రం సినిమా పోస్టర్ చూడడానికి కూడా మొహం చాటేస్తున్నారు ఆడియెన్స్.
అంతలా ప్రేక్షకులపై సినిమాల కంటే..రివ్యూల ప్రభావమే ఎక్కువుందని చెప్పక తప్పదేమో. అయితే ఇదే క్రమంలో సినిమా రివ్యూల మీద ఫిర్యాదులు కూడా మోపయ్యాయి. రివ్యూల కంటే…రివ్యూలలో వాడే పదాలు ఇబ్బంది కరంగా ఉన్నాయనేది వారి వాదన.
ఇలా సినిమా రివ్యూల మీద చాలా మంది చాలా రకాలుగా మండిపడ్డవాళ్ళున్నారు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ రజినికాంత్ కూడా సినిమా రివ్యూలపై ఆయన వెర్షన్ ని చెప్పేశారు. సినిమా విశ్లేషకులకు, విమర్శకులకు రజనీకాంత్ ఆయన స్టైల్ లో సూచనలిచ్చారు. చెన్నైలోని శివాజీ గణేషన్ నివాసంలో జరిగిన నెరుప్పుడా ఆడియో లాంఛింగ్ వేడుకలో రజనీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ.. సినిమాలు తీయడం మా బాధ్యత. సినిమాలు రివ్యూస్ ఇవ్వడం మీ వంతు. సినిమాకు రివ్యూస్ ఇచ్చే సమయంలో మీ అభిప్రాయాలను వెల్లడించేటప్పుడు తగిన పదజాలాన్ని ఉపయోగించాలని రజనీ అన్నారు. అలాగే సినిమా బృందాన్ని బాధ కలిగించకుండా.. సినిమాపై ఇచ్చే రివ్యూస్ ఆడియన్స్ కు చేరేవిధంగా కమ్యూనికేట్ చేయాలని ఫిల్మ్ క్రిటిక్స్ కు ఆయన సూచించారు.
ఇక రజిని తర్వాత హీరో విశాల్ కూడా మాట్లాడుతూ సినిమాకు రివ్యూస్ ఇవ్వడమనేది వారి భావ ప్రకటనాస్వేచ్చకు సబంధించిన విషయమని, ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉందని అన్నారు. కాకపోతే..ఒక సినిమా రివ్యూ ఇవ్వడానికి కనీసం మూడు రోజులైనా సమయం తీసుకోవాలని చెప్పాడు విశాల్.