ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తాం…

197
KCR reviews sheep distribution schem
- Advertisement -

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన సీఎం ప్రభుత్వ పథకాల్లో తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని… పథకాల అమలుకు ఆధార్ కార్డును అనుసంధించాలని సూచించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని కలెక్టర్లుకు ఆదేశించారు. గ్రామసభల్లో ఎంపీడీవో, తహసీల్దార్‌లు లాటరీ ద్వారా ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి రాజకీయ ఒత్తిడులు ఉండవని, ఎవరైనా ఒత్తిడి చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు.

రాష్ట్రంలో రెండున్నర నుంచి మూడు లక్షల వరకు ఒంటరి మహిళలు ఉన్నారని సీఎం తెలిపారు. వీరందరికి ఆసరా పెన్షన్ స్కీం వర్తింపజేయాలని చెప్పారు. మరో 81వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ స్కీంను వర్తింపచేయాలని సూచించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పెరుగుదల బాగుందని సీఎం వెల్లడించారు. 2016-17 త్రైమాసిక వృద్ధి పెరుగుదలలో 21 శాతంగా ఉందని, అందుకే రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 19.5గా పేర్కొన్నారని తెలిపారు. అభివృద్ధి రేటు 15శాతంకన్న ఎప్పుడు తక్కువ కాలేదన్నారు.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం. అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న విషయాన్ని కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో పట్టణాభివృద్ధి వేగంగా ఉంది. రాష్ట్రంలోని పేదరికాన్ని పారదోలడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. మానవ వనరులకు విరివిగా వాడుకోవడం వల్ల ప్రభుత్వం లక్ష్యాన్ని చేరుకుంటుంది. కృష్ణా జలాలతో మహబూబ్‌నగర్ ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం మొత్తం మనం రైతులకు సాగునీరు సంవృద్ధిగా అందించినైట్లెతే ఆర్థికాభివృద్ధి రేటు వేగంగా ఉంటుంది. రాష్ట్రంలోని రైతులకు నాణ్యమైన 9 గంటల ఉచిత విదుత్‌ను, మిగితా వారికి 24 కరెంటును అందిస్తున్నాం. నార్త్‌గ్రిడ్ విద్యుత్ అనుసందానం పూర్తి కావడంతో ఇప్పుడు కరెంటుతో సమస్య లేదని తెలిపారు.

గొర్రెల పంపిణీకి సంబంధించి సీఎం కలెక్టర్ల అభిప్రాయం తీసుకున్నారు. గొర్రెల పెంపకం సహాకార సంఘాల్లో రూ.51తో సభ్యత్వాలు చేయించాలన్నారు. అవసరమైతే సంఘాలు లేని ప్రాంతాల్లో కొత్త సంఘాలు ఏర్పాటుపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. జూన్ 20 నుంచి గొర్రె పిల్లల కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించారు. గొర్రె పిల్లల పంపిణీ పథకాన్ని కలెక్టర్లే పర్యవేక్షించి అమలు చేయాలన్నారు. గొర్రెల పంపిణీతో రాబోయే రెండేళ్లలో 20 వేల కోట్ల సంపద పెరుగుతుందని తెలిపారు. మన రాష్ట్రం మాంసం ఉత్పత్తి హబ్ కావాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ పోస్టులు వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు. ఎస్‌కేఎస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 44 లక్షల గొర్రెలు ఉన్నాయని తెలిపారు. ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలు అందజేస్తామన్నారు. యూనిట్ విలువ రూ.1లక్ష 25 వేలు అవుతుందని దీనిలో ప్రభుత్వం 75 శాతం(రూ.93,750) సబ్సిడీ రూపంలో అందజేస్తుందని, లబ్దిదారులు మిగితా 25 శాతం రూ.31,250 కట్టుకోవాలన్నారు.

నూతనంగా ఏర్పాటైన జిల్లాలో జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు భవన సముదాయాల నిర్మాణాలపై సమావేశంలో చర్చించారు. పనుల పురోగతి ఎక్కడికి వచ్చిందని కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వచ్చే సంవత్సరం నుంచి కొత్త భవనాల్లో పాలన కొనసాగించాలని చెప్పారు. తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ పోలీస్ భవన సముదాయల నిర్మాణం చేపడుతుందన్నారు.

- Advertisement -