దేశంలో 24గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తూన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దామరచర్లలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి పవర్‌ప్లాంట్‌ను పరిశీలించిన కేసీఆర్ అనంతరం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎండీ ప్రభాకర్ రావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు యావత్ దేశ కీర్తిని పెంచుతుందని సీఎం పేర్కొన్నారు. 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని తెలిపారు. రాష్ట్ర రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి ప్రయివేటు, కార్పొరేట్ల ఒత్తిడికి లొంగకుండా ప్రభుత్వ రంగంలోనే థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్లాంట్ ఆపరేషన్‌కు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బొగ్గు నిల్వలు సహా ఇతర ఆపరేషన్ విషయంలో అధికారులు ముందుచూపుతో వ్యవహరించాలని సూచించారు. పవర్ ప్లాంట్‌కు ప్రతి రోజు అవసరమయ్యే బొగ్గు, నీరు వివరాలపై సీఎం ఆరా తీశారు. నీటి సరఫరాకు కృష్ణా నీటిని సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకుని, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించేందుకే దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేశామని తెలిపారు.
పవర్ ప్లాంట్‌లో పని చేసే 10 వేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా టౌన్ షిప్ నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సిబ్బంది క్వార్టర్స్, మౌలిక సదుపాయాల కల్పనకు 100 ఎకరాలు సేకరించాలి. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు 50 ఎకరాలు ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు. దామరచర్ల హైవే నుంచి పవర్ ప్లాంట్ వరకు 7 కిలోమీటర్ల మేర ఫోర్ లైన్ సీసీ రోడ్లు నిర్మించాలన్నారు.
రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలోని రెండు యూనిట్లు 2023, డిసెంబర్ నాటికి పూర్తవుతాయని సీఎం కేసీఆర్‌కు సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.
కరోనా వల్ల ఏడాదిన్నరకు పైగా ప్లాంట్ నిర్మాణంలో జాప్యమైందని సీఎండీ వివరించారు. పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న తీరుపై సీఎండీని కేసీఆర్ అభినందించారు. థర్మల్ పవర్ ప్లాంట్‌కు భూమి ఇచ్చిన రైతులు, సాగర్ ప్రాజెక్టుకు సహకరించిన రైతుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి….